వైఎస్సార్‌ జిల్లాలో అధిక లోటు వర్షపాతం

High deficit rainfall in YSR District - Sakshi

     వైఎస్సార్‌ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం

     జెడ్పీ సమావేశంలో మంత్రి సోమిరెడ్డి 

     మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం

సాక్షి కడప: రాష్ట్రంలో దుర్బిక్ష పరిస్థితులు నెలకొని కరువు తాండవిస్తోందని, ముఖ్యంగా వైఎస్సార్‌ జిల్లాలో అత్యధిక లోటు వర్షపాతం నమోదైందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడపలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగిన జెడ్పీ సమావేశానికి ఇన్‌చార్జి మంత్రి హోదాలో హాజరైన సోమిరెడ్డి మాట్లాడుతూ కరువును ఎదుర్కొనేందుకు అన్ని విధాల సన్నద్ధమైనట్లు తెలియజేశారు. కరువు నేపథ్యంలో రైతుల రుణాలు రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు విషయమై టీడీపీ నేతలకు, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో కల్పించుకున్న మంత్రి సోమిరెడ్డి వైఎస్సార్‌ హయాంలోనే ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణాలు జరిగాయన్నది కాదనలేమన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుగంగ నిర్మాణానికి పూనుకున్నారని... అయితే వైఎస్సార్‌ ప్రాజెక్టులకు సంబంధించిన పనులన్నీ చేస్తూ వచ్చారన్నారు.

ఉచితంగా పశుగ్రాసం: మంత్రి ఆది
జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో కరువుపై చర్చ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీటీసీలు పట్టుబట్టడంతో చర్చించారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఉచితంగా పశుగ్రాసం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేయడంతోపాటు ఫ్లకార్డులను ప్రదర్శించారు. మంత్రి ఆది స్పందించి ఉచితంగానే పశుగ్రాసం పంపిణీకి చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

కాగా, జెడ్పీలో సభ ప్రొటోకాల్‌ రగడతో మొదలైంది. టీడీపీకి చెందిన ఆప్కో చైర్మన్‌ సభలో కూర్చోవడాన్ని నిరసిస్తూ ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, రవీంద్రనాథ్‌రెడ్డి వేదికపై కూర్చున్నారు. ఈలోపే మంత్రులు రావడం, వేదికపై సీట్లు లేకపోవడంతో మంత్రులకు, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top