టీఆర్‌ఎస్‌కు వందకుపైగా సీట్లు ఖాయం 

Harish Rao comments on Congress Party - Sakshi

మంత్రి హరీశ్‌రావు ధీమా 

రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ గుడ్డి తెలంగాణగా మార్చిందని ధ్వజం  

హుస్నాబాద్‌లో సీఎం సభకు ఏర్పాట్ల పరిశీలన

హుస్నాబాద్‌: రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వందకు పైగానే సీట్లు గెలుచుకుంటుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లో ఈ నెల 7న జరగనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. హెలిప్యాడ్, వేదిక ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. మంత్రి విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ రద్దు విషయంలో కేబినెట్‌ భేటీ అయ్యే వరకు వేచి చూడాలన్నారు. గతంలో హుస్నాబాద్‌ నుంచే కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించారని, అదే సెంటిమెంట్‌తో మళ్లీ ప్రజల ఆశీర్వాదం కోసం హుస్నాబాద్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

టీఆర్‌ఎస్‌కు ప్రజలే హైకమాండ్‌ అని.. కేసీఆర్‌ ప్రజల మనిషి అని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, మిషన్‌ కాకతీయ పథకాలను మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. తమది రైతు ప్రభుత్వమన్నారు. మహారాష్ట్రలో రైతులు తమ సమస్యల పరిష్కారానికి ‘చలో ముంబై’పేరిట ఆందోళన నిర్వహించారని, తమిళనాడులో అర్ధనగ్న ప్రదర్శనలు చేశారని, కానీ తెలంగాణలో అటువంటి వి ఉన్నాయా? అని ప్రతిçపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. త్వరలోనే ఏయే నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు ఉంటాయో షెడ్యూల్‌ విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో నిర్వహించే అన్ని బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని తెలిపారు.  

గుడ్డి తెలంగాణగా మార్చిన కాంగ్రెస్‌.. 
కాంగ్రెస్‌ హయాంలో ప్రజలకు, రైతులకు ఒరిగిందేమీ లేదని హరీశ్‌రావు విమర్శించారు. ఆ పార్టీ తన పాలనలో తెలంగాణను గుడ్డి తెలంగాణగా మార్చిం దని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చాక రైతు సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టామని, రైతు బంధు, రైతు బీమాలతో రైతుల్లో ధీమా వచ్చిందని అన్నారు. ముందస్తుపై కాంగ్రెస్‌ వెనక్కి జారు కుంటోందన్నారు. కాంగ్రెస్‌కు చాలాచోట్ల అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందన్నారు. మంత్రి వెంట కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు వేగవంతం 
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బస్‌ డిపో గ్రౌండ్‌లో సీఎం కేసీఆర్‌ పాల్గొనే ప్రజా ఆశీర్వాద బహి రంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నా యి. ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీశ్‌ పర్యవేక్షిస్తున్నారు. హెలిప్యాడ్‌ నిర్మాణాన్ని బుధవారం పరిశీలించారు. 20 ఎకరాల స్థలంలో సభకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వంద మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. సీఎం హైదరాబాద్‌ నుంచి నేరుగా హుస్నాబాద్‌ సభకు హెలికాప్టర్‌లో వస్తున్నందున డిపో వెనుక ఉన్న స్థలంలో హెలిప్యాడ్‌ను నిర్మిస్తున్నారు. 65 వేల మంది జనసమీకరణ లక్ష్యంగా నేతలు పని చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top