‘కాళేశ్వరం’ ఆపడం ఎవరితరం కాదు

Harish Rao Comments on AP CM Chandrababu and Congress Leaders - Sakshi

  ఏపీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్‌ నేతలపై హరీశ్‌రావు ధ్వజం  

  ఒడిశా అభ్యంతరం చెప్పిందని పోలవరాన్ని ఆపుతావా? 

  జగిత్యాలలో రూ.202 కోట్లతో సూరమ్మ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన 

సాక్షి, జగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపడం ఎవరితరం కాదని.. బ్రహ్మదేవుడు కూడా  ఆపలేడని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో 43 వేల ఎకరాలకు సాగు నీరందించేలా రూ.202 కోట్లతో శ్రీపాద ఎల్లంపల్లి కెనాల్‌ నెట్‌వర్క్‌ ప్యాకేజీ–2 పనులు, సూరమ్మ ప్రాజెక్టు పనులకు కథలాపూర్‌ మండలం కలికోటలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నాడు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు.. నేడు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం నిర్మాణాన్ని ఆపాలంటూ కేంద్రానికి లేఖ రాసిన ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పోలవరం ఆపాలని ఒడిశా ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినందుకు నువ్వు ప్రాజెక్టును ఆపుతావా..?’అని చంద్రబాబును ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాళేశ్వరం పనులు ఆగవని, ఆ నీటిలో కాంగ్రెసోళ్లు కొట్టుకుపోవడం ఖాయమన్నారు.

కేసీఆర్‌ నాయకత్వంలోనే కాళేశ్వరం పూర్తి చేస్తామని, కచ్చితంగా ఈ ఏడాదే నీరందించి తీరుతామని స్పష్టం చేశారు. గోదావరి నదిలో తెలంగాణకు 950 టీఎంసీల నీళ్లు కేటాయించాలంటూ గతంలోనే ఏపీ ప్రభుత్వం జస్టిస్‌ కృష్ణ కమిటీకి అఫిడవిట్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ నీళ్ల వాటా కోసమే కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు, సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు నిర్మిస్తున్నామని ఆయన వివరించారు.  ‘టీటీడీపీ నేతలను నేను ఒక్కటే అడుగుతున్న. మీ నాయకుడు చంద్రబాబు తెలంగాణలో పాలమూరు, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను ఆపా లని చూస్తుండు. మీకు చీము, నెత్తురు, పౌరుషం ఉంటే వెంటనే మీ రాజీనామా పత్రాలు ఆయన ముఖంపై కొట్టండి’అన్నారు.  కాంగ్రెస్‌ నాయకులు 2014 వరకు ఎల్లంపల్లిలో చుక్క నీరు కూడా నింపలేదన్నారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే రూ.600 కోట్లు ఖర్చు చేసి.. 2014లో 5 టీఎంసీలు, 2015లో పది టీఎంసీలు, 2016లో 20 టీఎంసీలు నింపి సాగునీరందిస్తున్నామని మంత్రి తెలిపారు. రాయపట్నం బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి అక్కడ లిఫ్టు ఏర్పాటు చేశామన్నారు. అక్కడి నుంచే సూ రమ్మ ప్రాజెక్టుకు నీరందుతుందన్నారు. 2007లోనే మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులకు కొబ్బరి కాయలు కొట్టిన కాంగ్రెస్‌ నేతలు.. 2014 వరకు.. ఏడేళ్లలో 4.70 లక్షల క్యూబిక్‌ మీటర్ల డ్యాం కాంక్రిట్‌ పనుల్లో కేవలం 50 వేల క్యూ.మీ పనులే పూర్తి చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన మూడు న్నరేళ్లలోనే మిగిలిన 4.20 లక్షల పనులు పూర్తి చేసి ప్రాజెక్టులో నీళ్లు నింపిందన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. మహిళలకు విడతల వారీగా వడ్డీ లేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అధ్యక్షత వహించిన ఈ సభలో ఎంపీ వినోద్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top