అనూహ్యం: గుజరాత్‌లో పెరుగుతున్న కాంగ్రెస్‌ సంఖ్యాబలం

Gujarat results: BJP leading in 98 seats, Congress+ in 81 seats - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికార బీజేపీకి గట్టిపోటీ ఇస్తోంది. తాజా ట్రెండ్స్‌ను బట్టి హస్తం సీట్లసంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గుజరాత్‌లో కాంగ్రెస్‌ మరోసారి అధికారానికి దూరంగానే ఉన్నా.. గట్టిఫైట్‌ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. తాజా ఎన్నికల సంఘం ట్రెండ్స్‌ ప్రకారం బీజేపీ మొత్తం 98 స్థానాలు (గెలుపు, ముందంజ) వచ్చే అవకాశం కనిపిస్తుండగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఏకంగా 81 (గెలుపు, ముందంజ)పైగా స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2012 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. కాంగ్రెస్‌ 19 సీట్లు ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుండగా.. బీజేపీ 16 సీట్లు కోల్పోయే అవకాశముంది. ఎన్సీపీ ఒక స్థానంలో, ఇతరులు మరో స్థానంలో ముందంజలో ఉన్నారు.

తాజాగా అందుతున్న ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తే.. బీజేపీ బొటాబోటీ మెజారిటీతో గుజరాత్‌ ఎన్నికలను గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది. గుజరాత్‌లో అధికారాన్ని చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 92.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ ఎన్నికల్లో అత్యంత హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి.. ఇక్కడి ఎన్నికల్లో ధాటిగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా పాకిస్థాన్‌తో కుమ్మక్కయిందని తీవ్ర ఆరోపణలు చేసి ప్రధాని మోదీ దుమారం రేపారు. తీరా ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒకింత అనుకూలంగానే ఉన్నా.. ఆ పార్టీ ఆశించిన మెజారిటీ రాలేదనేది ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top