అప్పుడు మోదీ ఒక్కరే...ఇప్పుడు ఎంతోమంది

Gujarat campaign: Not just Modi...BJP drafts a roster of heavy-hitters  - Sakshi

గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో మహామహులు

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీకి 2002, 2007, 2012లలో జరిగిన వరుస ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతల్ని ఒంటరిగా మీదేసుకొని మోసారు నేటి ప్రధాని నరేంద్ర మోదీ. వరుసగా మూడు ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మొదలుకొని కేంద్ర మంత్రి ఉమా భారతి వరకు అందరూ గుజరాత్‌ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. 182 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో 150 సీట్లను సాధించిన తీరాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా లక్ష్యాన్ని నిర్దేశించిన నేపథ్యంలో పార్టీ ప్రచార పటాలం మొత్తం దిగుతోందని భావించాలా?

వరుసగా మూడేళ్లపాటు బీజేపీ అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగు ఉంటుంది. హార్దిక్‌ పటేల్‌ నాయకత్వాన పటేదార్లు దూరమవడం, దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడం తదితర పరిణామాల నేపథ్యంలో విస్త›్తత ప్రచారం ఆ పార్టీకి అవసరం అయిందనుకుంటా? ఏది ఏమైనా ఈ ప్రచార పటాలంలో హిందూత్వ పోస్టర్‌ బాయ్‌గా ప్రచారం పొందిన యోగి ఆదిత్యనాథ్‌ కీలకమైన వ్యక్తి. ఆయన శుక్రవారం నుంచి దక్షిణ గుజరాత్‌తో పర్యటిస్తున్నారు. ప్రధానంగా రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. అక్టోబర్‌ 12వ తేదీ నుంచి కేంద్ర మంత్రి ఉమాభారతి ఉత్తర గుజరాత్‌లో ప్రచారం చేస్తున్నారు. అమె వ్యక్తులనుకాకుండా ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజె కూడా ఆమె వెన్నంటి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

బీజీపీ సీనియర్‌ నాయకరాలు, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ శనివారం నాడు తన ప్రచారాన్ని అహ్మదాబాద్‌ నుంచి ప్రారంభించారు. ఆమె ముందుగా అక్కడి కమ్యూనిటీ హాలులో మహిళా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో మహిళలను పెద్ద ఎత్తున సమీకరించాలన్నదే మోదీ వ్యూహంగా ప్రచారమైంది. మోదీ సూచనలమేరకు సుష్మా స్వరాజ్‌ మహిళా ఓట్ల సమీకరణపై దష్టిని కేంద్రీకరించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ కూడా సోమవారం ఎన్నికల ప్రచారం కోసం గుజరాత్‌ వెళుతున్నారు.

ఇంతకుముందు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గుజరాత్‌ నుంచి బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లేవారని, ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గుజరాత్‌కు బీజేపీ నాయకులు వస్తున్నారని హార్దిక పటేల్‌ తాజాగా వ్యాఖ్యానించారు. బీజేపీ బలహీన పడిందన్నది ఆయన మాటల అర్థం కావచ్చు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top