ఒప్పించి మెప్పించే నైపుణ్యం జానారెడ్డిది

Greatly innovated the book of Ajatha Satruvu - Sakshi

     తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య 

     ఘనంగా అజాత శత్రువు పుస్తకం ఆవిష్కరణ

     ఎవరినీ నొప్పించని మనస్తత్వం జానారెడ్డిది: ఉత్తమ్‌

     జానాది ప్రత్యేక వ్యక్తిత్వం: జైపాల్‌

సాక్షి,హైదరాబాద్‌: అందరినీ ఒప్పించి మెప్పించగల అజాత శత్రువు జానారెడ్డి అని తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అభివర్ణించారు. ఆయన ఒక సమర్థవంతమైన శాసనసభ్యుడు, అన్ని విషయాలపై అవగాహన పెంచుకొని సరైన రీతిలో సమాధానాలు ఇవ్వడంలో దిట్ట అని ప్రశంసించారు. బుధవారం గాంధీ భవన్‌లోని ఇందిరాభవన్‌లో ప్రెస్‌ ఆకాడమీ మాజీ చైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌ తాజా మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి గురించి రాసిన ‘అజాత–శత్రువు’పుస్తకాన్ని రోశయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జానారెడ్డిపై రాసిన పుస్తకం చిన్నదైనా అందులో ఎంతో విషయం ఉందని రచయితను అభినందించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఎవ్వరిని నొప్పించని మనస్తత్వం జానారెడ్డిదన్నారు. తెలుగు రాష్ట్రాలలో జానారెడ్డి గురించి తెలియని వ్యక్తి ఉండరని, రాష్ట్రంలోనే సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవులు నిర్వహించారన్నారు. 

కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ జానారెడ్డి ప్రత్యేక వ్యక్తిత్వం గల వ్యక్తి అన్నారు. రాజకీయాల్లో అజాత–శత్రువుగా ఉండడం ఎంతముఖ్యమో..అవసరమైనప్పుడు ధర్మాగ్రహం ప్రదర్శించడం అంతే అవసరమన్నారు. రాష్ట్రంలో అధర్మ స్థితి ఉందని, మెత్తగా మెల్లగా మాట్లాడితే బలహీనతగా చూస్తారని అందుకే అప్పుడప్పుడు దూకుడు పెంచాలని జానాకు సూచించారు. 

సీఎం పదవిని తిరస్కరించారు...
తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్నప్పుడు తమ పార్టీ అధిష్టానం జానారెడ్డిని సీఎం పదవి చేపట్టాలని కోరితే ఆయన తిరస్కరించారని శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్షనేత షబ్బీర్‌ అలీ వెల్లడించారు.తనకు పదవి వస్తే తెలంగాణ రాదని భావించి ఆ పదవిని త్యాగం చేశారని అన్నారు. కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ 16 శాఖలకు మంత్రిగా వ్యవహరించిన అనుభవశీలి జానారెడ్డి అని కొనియాడారు.

తుదివరకూ ప్రజోపయోగ కార్యక్రమాలకు..
ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిగా అంతిమ దశ వరకు కొనసాగాలని ఉందని జానారెడ్డి మాట్లాడుతూ అన్నారు. అందరి ఆశీర్వాదం, దీవెనలు ఉన్నంత వరకు ఇలాగే ఉంటానని వెల్లడించారు. తన రాజకీయ గురువు కె.వి.సత్యనారాయణ ఈ పుస్తక ఆవిష్కరణకు రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా జానారెడ్డి చెప్పారు. ఒక దశలో తన మిత్రుడు రామానుజాచారి మంత్రి అవుతావని జోస్యం చెప్పారని, ఆ తరుణంలో టీడీపీ ఆవిర్భావం కావడం, దానిలో భాగస్వామిని కావడం, తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కావడం అనూహ్యంగా జరిగిపోయిందని అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top