ఖాకీలే శత్రువులు !

Gorantla Madhav Resination Wantedly Not Accepting By Police Authorities - Sakshi

సాక్షి, అనంతపురం :  ‘గోరంట్ల మాధవ్‌.. ఇతను ఓ ప్రత్యేక పోలీసు.. ఎస్‌ఐగా ఉన్నపుడు ‘శివమణి’.. సీఐగా అయ్యాక ‘గబ్బర్‌సింగ్‌’... ‘అనంత’ వాసులు పెట్టిన ముద్దు పేర్లు ఇవి. సినిమా పేర్లలాగే ఇతని విధినిర్వహణ కూడా సినిమాటిక్‌గా ఉంటుంది. సర్కిల్‌తో పనిలేదు. వ్యక్తులస్థాయితో అసలు సంబంధం లేదు. మాధవ్‌ మనసుకు ఏది మంచి అనిపిస్తే అదే మంచి. చెడు అనిపిస్తే అదే చెడు. ఇదే అతనికి తెలిసిన ‘లా అండ్‌ ఆర్డర్‌’. మాధవ్‌ తీరు నచ్చి అతనికి అభిమానులుగా మారినవారూ కోకొల్లలు. శైలితో విభేదించి ధ్వేషించే వారూ ఉన్నారు. ఇవన్నీ  తెలిసినా ‘నేనేరా పోలీస్‌’ అంటూ ‘మోనార్క్‌లా, ‘మొండిఘటం’లా డ్యూటీ చేశారాయన.

ఇదే అతనికి స్పెషల్‌ క్రేజ్‌ తెచ్చిపెట్టింది. మరోవైపు ఇదే అతని కెరీర్‌లో మైనస్‌ కూడా అయింది. ధర్మవరంలో ఎస్‌ఐగా తనదైన శైలిలో డ్యూటీ చేశారు. అతనికి తొలి గుర్తింపు వచ్చింది అక్కడే. అప్పట్లో అక్కడ భరించలేక చిత్తూరుకు బదిలీ చేయించారు కొందరు రాజకీయనేతలు. ఆ తర్వాత మళ్లీ గుత్తి ఎస్‌ఐగా వచ్చారు. ఇక్కడా అదే తీరు. ఉన్నతస్థాయి లీడర్లపై కూడా చేయిచేసుకుని రచ్చ చేశారు. అక్కడా బదిలీ తప్పలేదు. ఆపై పరిగి ఎస్‌ఐగా బెల్ట్‌షాపులపై బీభత్సం చేసి షాపులను మూయించారు. రాజకీయనేతలంతా మాధవ్‌పై కన్నెర్ర చేశారు. కానీ మహిళలు మాత్రం స్టేషన్‌కు వచ్చి రెండు చేతులెత్తి ‘నువ్వు మా దేవుడివయ్యా!’ అంటూ మొక్కారు.  కానీ ‘ఎక్సైజ్‌’ దెబ్బకు అనంతపురం ట్రాఫిక్‌లోకి వచ్చి పడ్డారు. తర్వాత సీఐగా ప్రమోషన్‌ వచ్చింది. వన్‌టౌన్‌ ఏరియాలో మద్యం దుకాణాలకు సరికొత్త నిబంధనలు రూపొందించి సీసీ కెమెరాలు పెట్టించారు. ఇది మద్యం సిండికేట్‌ జీర్ణించుకోలేకోయింది.

‘స్వచ్ఛ భారత్‌’ అంటూ టీబీ ఆస్పత్రి శుభ్రం చేయించి హోంమంత్రి చినరాజప్పతో సన్మానం అందుకున్నారు. ఇంతలోనే ‘అనంత’లో కేబుల్‌ ఇష్యూకూ సంబంధించి పరిటాల శ్రీరాంకు వార్నింగ్‌ ఇచ్చారు. హౌసింగ్‌బోర్డులోని ఓ స్థలానికి సంబంధించి జెడ్పీ చైర్మన్‌ చమన్‌ను హెచ్చరించారు. వారి దెబ్బకు ఏకంగా సీఐడీకి వెళ్లాడు. దాదాపు ఏడాదిపాటు మాధవ్‌ మాట ‘అనంత’లో వినిపించలేదు. తర్వాత త్రీటౌన్‌ సీఐగా మళ్లీ ‘అనంత’కు వచ్చాడు. ఇక్కడా అదే తీరు. ఏం మారలేదు. త్రీటౌన్‌ పరిధే కాదు... జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఎవరు స్టేషన్‌కు వచ్చినా సమస్య విని జోక్యం చేసుకున్నారు.

ఇది ఇతర పోలీసులకు మింగుడు పడలేదు. డీఎస్పీ, ఎస్పీ వరకూ దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో  నోట్లరద్దు ఘటన సమయంలో ఎస్‌ఐపై చేయి చేసుకున్నారని మాధవ్‌ ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నారు. అప్పటికే అతని ఇమేజ్‌ తట్టుకోలేని పోలీసులు మాధవ్‌ను బాధ్యున్ని చేస్తూ వీఆర్‌కు పంపారు. తర్వాత కదిరి సీఐగా వచ్చిన తర్వాత కూడా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి డీఎస్పీని, జిల్లా ఎస్పీని ఏకంగా పోలీసుశాఖను కొజ్జాలు అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎవరూ స్పందించలేదు. కానీ మాధవ్‌ విలేకరుల సమావేశం పెట్టిమరీ ‘డిపార్ట్‌మెంట్‌ జోలికి వస్తే ఖబర్దార్‌ అంటూ హెచ్చరించారు. ‘అనంత’లోనే కాదు... ఎస్‌ఐగా కడప జిల్లాలో కూడా ఇదే తరహా డ్యూటీ చేశారు.
 
ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి... 
ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాల్లోకి రావాలని మాధవ్‌ తన ఉద్యోగానికి వీఆర్‌ఎస్‌ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీలో చేరారు. కానీ అప్పటి వరకూ మాధవ్‌కు అండగా నిలిచి పోలీసులు ఒక్కసారిగా సహాయ నిరాకరణ చేశారు. కారణం ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు కావడమే. కనీసం అరే.. మనోడు ఇన్నేళ్లు పోలీసుశాఖలో పనిచేశాడు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత గెలుపోటములు దైవాదీనం, కానీ కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్నే త్యాగం చేస్తున్నాడు. కనీసం మనం రాజీనామా ఆమోదించేందుకు సహకరిద్దామని ఉన్నతాధికారులు ఆలోచించలేదు. ఎంతసేపు ఎలా మాధవ్‌ నామినేషన్‌ను ఆపాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. పైకి గంభీరంగా కన్పిస్తున్న మాధవ్‌ లోలోల చాలా బాధపడుతున్నారు. ‘నేను – నా ఖాకీ చొక్కా.. అంటూ 22ఏళ్లకుపైగా నిక్కచ్చిగా డ్యూటీ చేశా.

నా ఉద్యోగాన్ని నేను వదలుకుంటానన్నా ప్రభుత్వం అడ్డుపడుతోందని వేదనపడుతున్నారు. అతనిపై కుట్రలు ఎందుకు? రాజీనామా ఆమోదించండి? నామినేషన్‌కు అడ్డంకులు తొలగించండి అని న్యాయం స్థానం ఉత్తర్వులిచ్చినా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు పనిచేస్తోంది ప్రభుత్వం కనుసన్నల్లో కాదు. ఎలక్షన్‌ కమిషన్‌ అజమాయిషీలో. నిర్ణయాధికారం ప్రభుత్వానిది కాదు... ఎన్నికల కమిషన్‌దే. ప్రభుత్వ ఒత్తిడి ఉన్నన్ని రోజులు రాజీనామా ఆమోదించకుండా ఉన్న అధికారులు కనీసం ఇప్పుడైనా రాజీనామా ఆమోదించాలని మాధవ్‌తో పాటు ఆయన అభిమానులు కోరుతున్నారు.      

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top