
జగిత్యాల అగ్రికల్చర్: శాసనసభ సమావేశాల్లో రైతు సమస్యలపై పోరాటం చేస్తానని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లాలో చల్‌గల్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శరత్‌తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పంటలకు బోనస్ ధర, దోమపోటుకు పంట నష్ట పరిహారం, బీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరలు రైతులకు గిట్టుబాటుకానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వరి, మొక్కజొన్న పంటలకు కనీసం రూ.200 నుంచి 400 వరకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏ పంట పండించినా అయ్యే ఖర్చు తీసివేసిన తర్వాత రైతులకు వచ్చే ఆదాయం రెట్టింపు ఉంటేనే రైతులు బతికే పరిస్థితి ఉందని చెప్పారు. ఉత్పత్తి వ్యయం అధారంగా పంటలకు మద్దతు ధరలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.