ఒక అసెంబ్లీ... ఇద్దరు ఎమ్మేల్యేలు...

In The Early Stages of Elections, There Were Two Members Constituencies - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికలు మొదలైన తొలి దశకంలో కొన్నిచోట్ల ద్విసభ్య (ఇద్దరు సభ్యుల) నియోజకవర్గాలు ఉండేవి. వాటిలో ఒకటి ఎస్సీలకు, మరొకటి జనరల్‌కు కేటాయించేవారు. అప్పట్లో ఎస్సీ ఓటర్లు అధికంగా ఉండేచోట్ల ఈ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యేవారు. 1962 ఎన్నికల నుంచి ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. శ్రీకాకుళం, అదే జిల్లాలో పాతపట్నం ద్విసభ్య నియోజకవర్గాలుగా ఉండేవి.

విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, గజపతినగరం, విజయనగరం, శృంగవరపుకోట ద్విసభ్య స్థానాలు ఉండేవి. విశాఖ జిల్లాకు వస్తే.. పాడేరు (అప్పట్లో గొలుగొండ), నర్సీపట్నంలో ఈ స్థానాలు ఉండేవి. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు (అప్పట్లో పల్లిపాలెం. 2009లో రద్దయిన నియోజకవర్గం), కాకినాడ, అమలాపురం, రాజోలు, రాజానగరం నియోజకవర్గాలు ద్విసభ్య జాబితాలో ఉండేవి. పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే.. కొవ్వూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం ఉండేవి.

కృష్ణా జిల్లాలో అవనిగడ్డ (అప్పట్లో దివి), ప్రకాశం జిల్లా ఒంగోలు, కందుకూరు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం (ప్రస్తుతం కోవూరు), నెల్లూరు, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలు ద్విసభ్య స్థానాలుగా ఉండేవి. కడప జిల్లా రాజంపేట, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని, అనంతపురం జిల్లా గుంతకల్లు, కల్యాణదుర్గం, హిందూపూర్, ధర్మవరం, చిత్తూరు జిల్లా పుంగనూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు నియోజకవర్గాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను ఎన్నుకునేవారు. ఈ నియోజకవర్గాల్లో ప్రతి ఓటరు ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం ఉండేది. గుంటూరు జిల్లాలో మాత్రం ఒక్కటి కూడా ద్విసభ్య నియోజకవర్గం లేకపోవటం గమనార్హం.   

గుర్తుందా! 
1967కి ముందు విశాఖ నగరం మొత్తం ఒకే నియోజకవర్గంగా ఉండేది. 1967లో ఇది విశాఖ–1, విశాఖ–2 స్థానాలుగా విడిపోయింది. 2009లో ఆ రెండు నియోజకవర్గాలు రద్దవగా, పునర్విభజనతో విశాఖ (తూర్పు), విశాఖ (పశ్చిమ), విశాఖ (దక్షిణం), విశాఖ (ఉత్తరం) నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. అదే ఏడాది పరవాడ నియోజకవర్గం రద్దవగా, ఆ స్థానంలో గాజువాక ఏర్పాటైంది. 1955, 62 ఎన్నికల్లో కొండకర్ల నియోజకవర్గం ఉండేది. 1967లో అది రద్దయ్యింది. 1962 ఎన్నికల్లో బొడ్డం నియోజకవర్గం ఉండేది. ఆ తరువాత రద్దయ్యింది. 
1955 ఎన్నికల్లో గూడెం (ఎస్టీ) నియోజకవర్గం ఉండేది. 1962 ఎన్నికల్లో అది చింతపల్లి (ఎస్టీ)గా మారింది. 2009 పునర్విభజనలో చింతపల్లి రద్దయి, ఆ స్థానంలో అరకు (ఎస్టీ) ఏర్పాటైంది. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పాటైన గొలుగొండ 1967లో రద్దయ్యి, పాడేరు (ఎస్టీ) ఏర్పాటైంది. 1967లో ఏర్పడిన జామి నియోజకవర్గం 1978లో రద్దయి పెందుర్తి నియోజకవర్గం తెరపైకి వచ్చింది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top