డీఎంకే పగ్గాలు స్టాలిన్‌కే

DMK Into the Hands of Stalin - Sakshi

పార్టీపై కొన్నేళ్లుగా పూర్తిస్థాయి పట్టు.. సోదరుడు అళగిరి వర్గం కూడా ఆయన వైపే

సాక్షి, చెన్నై: కరుణానిధి రాజకీయ వారసుడిగా ఆయన చిన్న కుమారుడు ఎం.కె. స్టాలిన్‌ డీఎంకే పగ్గాలు చేపట్టడం లాంఛనంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ నిర్వాహక అధ్యక్షుడైన స్టాలిన్‌ డీఎంకేపై ఇప్పటికే పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. పార్టీలో మరోసారి చీలిక ఏర్పడకుండా తన సోదరుడు, కరుణ పెద్ద కుమారుడు అళగిరి వర్గాన్ని తనవైపు తిప్పుకున్నారు. స్టాలిన్‌ను ఢీకొనే నాయకులెవరూ పార్టీలో లేకపోవడంతో ఆయన పగ్గాలు అందుకునేందుకు ఎవరి నుంచీ వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం దాదాపు లేనట్లే.

చక్రం తిప్పిన కరుణ...
డీఎంకేలో 50 ఏళ్లపాటు కరుణ చక్రం తిప్పారు. దివంగత ఎంజీఆర్‌ రూపంలో డీఎంకేలో చీలిక వచ్చినా ఆ తదుపరి పరిణామాలతో పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకున్నారు. తన ప్రాణ మిత్రుడు అన్బళగన్‌ను ప్రధాన కార్యదర్శిని చేశారు. అయితే చిన్న కుమారుడు స్టాలిన్‌ను రాజకీయ తెరపైకి తెచ్చిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో 1994లో డీఎంకే మరోసారి చీలింది. ఆ సమయంలో పార్టీలో సీనియర్‌గా ఉన్న వైగో ఎండీఎంకేను ఏర్పాటు చేశారు. డీఎంకే ఎన్నికల చిహ్నం ‘ఉదయించే సూర్యుడి’ కోసం ఇరు పార్టీల మధ్య పెద్ద సమరమే సాగినా చివరకు దాన్ని కరుణ సొంతం చేసుకున్నారు. తద్వారా డీఎంకే కోటను కైవశం చేసుకోవడం ఎవరితరం కాదని చాటారు. క్రమంగా స్టాలిన్‌కు రాజకీయ ప్రాధాన్యతను పెంచుతూ వచ్చిన సమయంలో పెద్ద కుమారుడు అళగిరి రూపంలో ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.

2006 అసెంబ్లీ ఎన్నికల తదుపరి వయోభారం కారణంగా స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్ట బెట్టారు. అదే సమయంలో పెద్ద కుమారుడికి న్యాయం చేసేందుకు ఆయన్ను దక్షిణ తమిళనాడు పార్టీ వ్యవహారాల కార్యదర్శిగా నియమించారు. అయితే అన్నదమ్ముల మధ్య రాజకీయ సమరం ముదురుతూ రావడంతో తన బలాన్ని పెంచుకు నేందుకు స్టాలిన్‌ అడుగులు వేశారు. ఇందుకు తెర వెనుక నుంచి కరుణ సహకారం అందించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో అళగిరి మదురై ఎంపీగా గెలిచాక ఆయన్ను కేంద్ర మంత్రిని చేసి (యూపీఏ కూటమి ద్వారా) స్టాలిన్‌ను పార్టీలో అందలం ఎక్కించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారంటూ అళగిరిపై బహిష్కరణ వేటు వేయించారు. చివరకు వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలను కరుణానిధి స్టాలిన్‌కు పూర్తిగా అప్పగించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top