పొత్తుల పేరుతో తప్పుడు ప్రచారం

Dharmana Prasada Rao Fires On TDP Over Ap Special Category Status - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా పోరాడుతున్నారని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్సార్‌ సీపీకి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల భేటీపై పొత్తుల పేరుతో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా వైఎస్సార్‌ సీపీ ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాడుతునే ఉందని తెలిపారు. ఏ రాజకీయ పార్టీతోను వైఎస్సార్‌ సీపీ పొత్తు పెట్టుకోదని.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాలుగేళ్లు కేంద్రంతో అంటాకాగి హోదాను నీరుగార్చారని విమర్శించారు. హోదా వద్దని.. ప్యాకేజీ కావాలని చంద్రబాబు అనలేదా అని నిలదీశారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే.. ఎవరిని ప్రశ్నించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మాట మీద నిలబడటం లేదని ఆరోపించారు. ప్యాకేజీకి అంగీకరించిన టీడీపీ నేతలు కేంద్రమంత్రులకు సన్మానం చేయలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు హోదా ఇవ్వలేదని చంద్రబాబు బీజేపీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాజధాని భూముల అగ్రిమెంట్‌లు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top