పలక్కాడ్‌లోనే ప్రతికూల ప్రభావం... | Sakshi
Sakshi News home page

సీపీఎం పంథా వల్ల కేరళలో బీజేపీకే లాభం

Published Wed, Jan 24 2018 8:17 PM

CPM says No to Congress alliance may to bjp - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీతోని ఎలాంటి పొత్తు కుదుర్చుకోరాదంటూ సీపీఎం పార్టీలో మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కారత్‌ వర్గం తీసుకున్న నిర్ణయం ఆయన సొంత పట్టణమైన పలక్కాడ్‌లోనే ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా భారతీయ జనతా పార్టీ లాంటి హిందూత్వ పార్టీలను దగ్గరకు రానీయక పోవడం సీపీఎం లక్ష్యం.

కేరళలోని పలక్కాడ్‌ మున్సిపాలిటీని మెజారిటీ లేకున్నా భారతీయ జనతా పార్టీ పాలిస్తోంది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీతో సీపీఎం చేతులు కలపకపోవడమే అందుకు కారణం. ‘మున్సిపాలిటీ నుంచి బీజేపీని దించేందుకు మేం కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపం. అది మా రాజకీయ పంథాకు విరుద్ధం’ అని పలక్కాడ్‌ లోక్‌సభ సభ్యుడు ఎంబీ రమేశ్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ పార్టీతో పెట్టుకుంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలంటే ఏమిటో చెప్పకపోయినా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడమే. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోని కారణంగా రానున్న కేరళ అసెంబ్లీలో, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సీపీఎం దాన్ని ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.

2015, నవంబర్‌లో జరిగిన పలక్కాడ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 52 వార్డులకుగాను బీజేపీకి 24 వార్డులు, యూడీఎఫ్‌కు 16 వార్డులు, ఎల్‌డీఎఫ్‌కు 6 వార్డులు, ఇతరులకు 6 వార్డులు వచ్చాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ అవడం వల్ల ఆ పార్టీతోని చేతులు కలపడానికి సీపీఎం ఇష్టపడలేదు. 2019లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఇదే పంథాను అనుసరించాలని పార్టీ కేంద్ర కమిటీని ఒప్పించడంలో కేరళ సీపీఎం శాఖ విజయం సాధించింది. పలక్కాడ్‌ ఉదాహరణే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎదురుకాదనే గ్యారంటీ ఉందా? రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement