వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారానికి కుట్ర! | Conspiracy against YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారానికి కుట్ర!

Apr 17 2018 1:24 AM | Updated on Jul 28 2018 3:41 PM

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై దుష్ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కుట్రకు తెరతీశారు. ఇందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌ సందర్భంగా తిరుపతిలో జరిగిన బైక్‌ దగ్ధం ఘటనను ఆ పార్టీకి ముడిపెట్టాలని మంత్రులకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. బంద్‌లో విధ్వంసం సృష్టించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ పనిచేసినట్లు కనిపిస్తోందని, దీన్ని ఆసరా చేసుకుని ఆ పార్టీపై ఎదురుదాడి చేయాలని చెప్పినట్లు సమాచారం. సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బంద్‌ ఎలా జరిగిందనే దానిపై చర్చ జరిగింది.

ఈ సమయంలో తిరుపతి బైక్‌ దగ్ధం ఘటన ప్రస్తావనకు రావడంతో.. ఇందులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల పాత్ర ఉందనే అనుమానాలు లేవనెత్తాలని, ఇప్పటికే ఆ దిశగా విచారణ జరుగుతోందని చెప్పాలని సూచించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి దీంతో సంబంధం ఉన్నట్లు గట్టిగా ఆరోపణలు చేయాలని మంత్రులు, ముఖ్య నాయకులు దీనిపై దృష్టిపెట్టి ఎక్కడికక్కడ మీడియా సమావేశాల్లో ఈ విషయాన్ని పెద్దది చేసి చూపాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. గతంలో తుని రైలు దగ్ధం ఘటనలో భూమన కరుణాకర్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు చేసిన మాదిరిగానే ఈ ఘటనలోనూ ఆయనకు లింకుపెట్టి ప్రచారం చేయాలని సూచించినట్లు సమాచారం.

ఇలా చేయడం ద్వారా బంద్‌ల ద్వారా రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించేందుకు జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు విస్తృతంగా జనంలో చెప్పాలని మంత్రులకు బాబు దిశానిర్దేశం చేశారు. అలాగే, కృష్ణా జిల్లాలో జరుగుతున్న జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు వస్తున్న జనం గురించి కూడా అనుమానాలు రేకెత్తేలా మాట్లాడాలని చెప్పినట్లు సమాచారం. జనం రావడంలేదని, మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు, నకిలీ వీడియోలు పత్రికలకు ఇస్తున్నారని ప్రచారం చేయాలని కూడా చంద్రబాబు సూచించినట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement