‘అక్కడ దాడులు చేస్తే వందల కోట్లు దొరుకుతాయి’

Congress Leaders Slams TRS Over IT Raids On Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్‌నాయకులు తప్పుబట్టారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసానికి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జానారెడ్డిలు ఈ దాడులను ఖండించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అణచివేత దోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు గళమెత్తినా వారిని టార్గెట్‌ చేస్తూ కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకులు డీకే శివకుమార్‌పై ఐటీ దాడులను యావత్‌ దేశం చూసిందన్నారు. ఇవాళ తెలంగాణలో రేవంత్‌ రెడ్డిని కేంద్ర సంస్థల సహాకారంతో కేసీఆర్‌ ఎలా ఇబ్బందులు పెట్టి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారో ప్రజలందరు గమనించాలని కోరారు. ఎన్నికల వేళ అకారణంగా ఇంట్లో ఎవరు లేనప్పుడు సోదాలు నిర్వహించటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. నిజంగా ఐటీ శాఖకు డబ్బులు కావాలంటే టీఆర్‌ఎస్‌ కార్యలయం, కేసీఆర్‌ నివాసంపై రైడ్‌ చేయాలని.. అక్కడ అడ్డగోలుగా దోచుకున్న వందల కోట్లు దొరుకుతాయని ఆరోపించారు. అక్రమ కేసులతో కాంగ్రెస్‌ శ్రేణులను భయపెడతామంటే.. భయపడేది లేదని.. రెట్టించిన ధైర్యంతో కొట్లాడతామని తెలిపారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి, అణచివేసేందుకు జరిగే దాడులను తిప్పి కొడతామని పేర్కొన్నారు. రేవంత్‌ ఇంటిపై జరుగుతున్న దాడులను.. తెలంగాణ సమాజంపై, తెలంగాణ ప్రజల మీద జరుగుతున్నవిగా ఆయన పేర్కొన్నారు.

మోదీతో కుదుర్చుకున్న అంతర్గత ఒప్పందంతోనే దాడులు..
జానారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నవారిని అణచివేసే విధానాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఏర్పరుచుకున్న అంతర్గత ఒప్పందంతోనే కేసీఆర్‌ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. చట్టబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ, ఇక్కడ కేసీఆర్‌ ఒకేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యవాదుల మనుగడ కొనసాగాలంటే ఈ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలని ప్రజలను కోరారు. ఇలాంటి దాడులకు కాంగ్రెస్‌ భయపడదని స్పష్టం చేశారు. మాల్దీవుల్లో ప్రతిపక్షాలను అణగదొక్కిన అక్కడి అధ్యక్షుడు ఓటమిపాలయ్యారని.. తెలంగాణలో కూడా అదే పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్‌ నాయకులపై కక్ష సాధింపు
మరోవైపు కాంగ్రెస్‌ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ సీనియర్‌ నాయకులు వి హనుమంతరావు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ నాయకులపై కక్ష సాధింపులకు దిగుతోందని విమర్శించారు. ఇటీవల జగ్గారెడ్డిపైన పాత కేసులు తిరగదోడి, నేడు రేవంత్‌రెడ్డిపైన ఐటీ దాడులు జరిపి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్‌ ఢిల్లీలో 40 నిమిషాలు ప్రత్యేంగా భేటీ అయ్యారని.. అప్పుడే ఈ దాడులకు ప్రణాళిక సిద్ధం అయిందని ఆరోపించారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌పైన తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇదీ పునరావృతం అవుతుందని హెచ్చరించారు. తాము కూడా టీఆర్‌ఎస్‌ బొక్కలు తవ్వడం స్టార్ట్‌ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా మెట్రో రైల్‌ ఓపెనింగ్‌ సమయంలో గవర్నర్‌ నరసింహాన్‌తో కలిసి అపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ తొక్కడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ దగ్గరకు వస్తుంటే టీఆర్‌ఎస్‌ పేరుపైన ప్రకటనలు ఇవ్వడం ఎంటని ప్రశ్నించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top