ఆ విషయం చెప్పినవారినే అడగండి: జానారెడ్డి

congress leader Janareddy chit chat with media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని తాను ఎప్పుడు చెప్పలేదని, చెప్పినవారినే ఆ విషయం అడగాలని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు.  మీడియాతో ఆయన శుక్రవారం చిట్‌చాట్‌ చేశారు. ‘  అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదు. ప్రభుత్వం తమకు నచ్చిన అంశాలనే తీసుకొస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, ఇళ్ల నిర్మాణంపై చర్చకు వెనకాడుతోంది.’  అని జానారెడ్డి వ్యాఖ్యానించారు.

మరోవైపు శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. కాగా ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆ సమయంలో ఆయా అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు వివరంగా సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు, నకిలీ విత్తనాలు, కొత్త రహదారులు, ఇంటర్ విద్య, వ్యవసాయం, నూతన జిల్లా సముదాయాలు, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ వంటి అంశాలపై మంత్రులు సమాధానమిచ్చారు.  ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం పిటిషన్ అవర్ కొనసాగించారు. సభ్యులు లేవనెత్తిన పలు సమస్యలను సంబంధిత మంత్రులు నోట్ చేసుకుని పరిష్కరిస్తామని చెప్పారు. తదనంతరం సభకు 15 నిమిషాల పాటు టీ విరామం ఇచ్చారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో కేసీఆర్ కిట్లపై లఘు చర్చ చేపట్టారు. చర్చ అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి మధుసూదనాచారి ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top