నల్లగొండ బరిలో ఉత్తమ్‌ | Congress Finalises MP Candidates Except Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మం మినహా మిగతా 8స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు 

Mar 19 2019 12:31 AM | Updated on Sep 19 2019 8:44 PM

Congress Finalises MP Candidates Except Khammam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ అధిష్టానం సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఇప్పటికే 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించగా.. తాజాగా ఖమ్మం మినహా మరో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీపీసీసీ చీఫ్, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నల్లగొండ ఎంపీ స్థానం నుంచి బరిలో దింపింది. అటు మహబూబ్‌నగర్‌ స్థానానికి డీకే అరుణ, జి.మధుసూదన్‌రెడ్డి పేర్లపై చర్చ జరిగినప్పటికీ.. చివర్లో వంశీచంద్‌రెడ్డి పేరును ఖరారుచేసింది. తాజా జాబితా ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి ఫిరోజ్‌ ఖాన్, సికింద్రాబాద్‌ నుంచి అంజన్‌కుమార్‌ యాదవ్, నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లు రవి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నిజామాబాద్‌ నుంచి మధుయాష్కీ గౌడ్, ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన వరంగల్‌ నుంచి దొమ్మాటి సాంబయ్య బరిలో దిగనున్నారు.

నల్లగొండ స్థానంపై తీవ్ర తర్జనభర్జనలు జరిగాయి. పార్టీకి పట్టున్న ఈ స్థానంలో సమర్థులైన అభ్యర్థులు బరిలో ఉంచాలని ఏఐసీసీ భావించిన నేపథ్యంలో ఉత్తమ్‌ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం ఒక్కో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చేజారుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్‌ను ఎంపీగా పోటీచేయించడం సాహసమైన నిర్ణయమే. ఒకవేళ ఉత్తమ్‌ గెలిస్తే.. హుజూర్‌నగర్‌నుంచి ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఈ జాబితా ఉదయమే దాదాపుగా ఖరారైనా.. పాలమూరు, ఖమ్మం స్థానాలపైనే ప్రతిష్టంభన నెలకొనడంతో ఆలస్యమైంది. అయితే.. అర్ధరాత్రి వరకు చర్చలు జరిపిన తర్వాత పాలమూరు నుంచి వంశీచంద్‌ రెడ్డి పేరు ఖరారుతో జాబితాను వెల్లడించింది. అయితే ఖమ్మం స్థానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. తెలంగాణకు సంబంధించి 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లతోపాటుగా.. ఆంధ్రప్రదేశ్‌లోని 22 ఎంపీ స్థానాలకు, 132 ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఏఐసీసీ జాబితాను ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement