ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్‌

Congress Boycott MLC Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఫిరాయింపులకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. ఈ విషయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సోమవారం మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇక రేపే (మంగళవారం) ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అధికార పార్టీ మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి 5 స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక కాంగ్రెస్‌ తరఫున గూడూరు నారయణ రెడ్డి బరిలోకి దింపగా.. ఆ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

ప్రతిపక్షమే లేకుండా చేసే కుట్ర : ఉత్తమ్‌
సీఎం కేసీఆర్‌ ఫిరాయింపులతో ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూస్తున్నారని ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు.  ‘కూటమిగా పోటీచేసిన మాకు 19 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉండటంతో ఒక ఎమ్మెల్సీ గెలిచే అవకాశం ఉంది. అందుకే మేము ఒక అభ్యర్థిని నిలబెట్టాం. కానీ సీఎం కేసీఆర్‌ ఫిరాయింపులతో మా ఎమ్మెల్యేలను లాక్కొంటున్నారు. సీఎం వైఖరికి నిరసనగా.. ఈ ఎన్నికలను మేం బహిష్కరిస్తున్నాం. ప్రధాని ఎవరనేది ప్రజలు నిర్ణయించాలి. మత రాజకీయాలు చేస్తున్న మోదీ కావాలా? త్యాగాలు చేసే రాహుల్‌ గాంధీ కావాలా?  16 ఎంపీలను గెలిపించాలంటున్న టీఆర్‌ఎస్‌ గత 5 ఏళ్లలో  ఏం చేసింది. ఒక్క నంది ఎల్లయ్య మినహా మిగతా ఎంపీలంతా టీఆర్‌ఎస్‌, వారి మిత్రపక్షాలే కదా. 16 మంది ఎంపీలు ఉండి కూడా విభజన హామీలు సాధంచలేదు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్లే’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

సీఎం కేసీఆర్‌ తీరు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన సంకేతమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని, అధికార పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమం చేస్తామన్నారు. 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్యలు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. వీరికి తోడు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top