నామినేటెడ్‌ పదవిస్తా.. సర్దుకుపో!

Chandrababu refers to AV Subba Reddy - Sakshi

     ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు సూచన

     దాడి విషయం మర్చిపోవాలి

     మంత్రి అఖిలతో బలవంతంగా సయోధ్య కుదిర్చిన సీఎం

సాక్షి, అమరావతి: మంత్రి భూమా అఖిలప్రియతో సర్దుకుపోవాలని ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్రబాబు సూచించారు. నామినేటెడ్‌ పదవి ఇస్తానని, గొడవలు లేకుండా ఆమెతో కలిసి పనిచేయాలని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఆయన ఇరువురితో సమావేశమై చర్చించారు. మంత్రి అఖిలప్రియతోపాటు ఆమె సోదరి మౌనికారెడ్డి, సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ సైకిల్‌ యాత్రలో తనపై దాడి చేయించింది అఖిలప్రియేనని, దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరారు.

అఖిలప్రియ కూడా అక్కడ జరిగిన ఘటన గురించి వివరించినట్లు తెలిసింది. ఇద్దరి మాటలు విన్న తర్వాత.. గొడవలు పెట్టుకోవద్దని, పార్టీ కోసం కలిసి పనిచేయాలని చంద్రబాబు ఇరువురికీ సర్దిచెప్పారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనే సుబ్బారెడ్డి డిమాండ్‌ను చంద్రబాబు పట్టించుకోలేదని సమాచారం. జరిగిందేదో జరిగింది, ఆ విషయం మరచిపోవాలని, పార్టీలో సముచిత ప్రాధాన్యత ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. అయినా సుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కానీ, బయటకు వచ్చిన తర్వాత అఖిలప్రియతో కలిసి పనిచేస్తానని మీడియాకు చెప్పడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top