
సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నీరు–ప్రగతిపై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జగన్ అభిమాని దాడి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, టీడీపీకి ముడిపెడుతున్నారన్నారు. రాజకీయం, పరిపాలన రెండూ ముడిపడివుంటాయని చెప్పారు. ప్రత్యర్థులను కట్టడి చేయడానికి వ్యవస్థలను వాడుకోవడం సరైందికాదన్నారు.
ఎన్డీఏలో ఉన్నంతకాలం తమపై ఐటీ దాడులు లేవని, బయటకు వచ్చాకే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. సీబీఐలో పరిణామాలు దేశానికి అప్రతిష్ట తెచ్చాయన్నారు. ఖరీఫ్‌లో 91 శాతం సేద్యం జరిగిందని, రబీలో కూడా సేద్యం ముమ్మరంగానే జరగనుందన్నారు. కౌలురైతులకు రూ.3,425 కోట్లు పంటరుణాలు ఇచ్చామన్నారు. త్వరలోనే మరో రెండు లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని, ప్రతిరోజూ వెయ్యి ఇళ్ల నిర్మాణం పూర్తికావాలన్నారు. కర్నూలులో స్వైన్ ఫ్లూ అధికంగా ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచే స్వైన్ ఫ్లూ విస్తరిస్తోందని, సరిహద్దు ప్రాంత జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.