
సాక్షి, అమరావతి: తనను దెబ్బతీసేందుకే రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు పెట్టారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు ఎప్పుడూ పెట్టలేదని ఈసారి కావాలని పెట్టారని, అభ్యర్థుల ఎంపిక, ఏర్పాట్లు చేసుకోలేననుకుని ఇలా చేశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందా అనే దానిపై సూటిగా సమాధానం చెప్పకుండా జాతీయ రాజకీయాల్లో అవసరమైతే కలిసి పనిచేసే ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తు ఇప్పటికి లేదని తెలిపారు. తెలంగాణలో టీడీపీ పోటీలో ఉంటుందా అనే దానిపైనా తప్పించుకునే ధోరణిలో సమాధానమిచ్చారు.
అక్కడి రాష్ట్ర పార్టీ నిర్ణయానికి పోటీ చేయాలా..వద్దనే విషయాన్ని వదిలేశామని వారే చూసుకుంటారని తెలిపారు. రాష్ట్రం పట్ల కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి, ప్రధాని మోడీ కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ సీబీఐ డైరెక్టర్ 2017లో రాసిన లేఖను బయటపెట్టారు. జగన్‌ను కేసీఆర్, మోడీ లొంగదీసుకున్నారని, దానికి ఈ లేఖే ఉదాహరణని చెప్పారు. ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్, సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకి 2017 మే 30న ఈ లేఖ రాశారని తెలిపారు. ఈడీ డైరెక్టర్ లేఖ రాసి రెండేళ్లైందని, మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఒకటి, రెండు రోజుల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. అంతకుముందు టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. రెండురోజుల్లో ఎన్నికల మేనిఫెస్టో, ఆడియో సాంగ్స్ విడుదల చేస్తామని తెలిపారు. 15వ తేదీ నుంచి సేవామిత్రలు, బూత్ కన్వీనర్లతో జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తానని చెప్పారు. 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంత పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.