‘సీఈవోపై పొలిటికల్‌ ప్రెజర్‌ ఉంటుంది’

CEO Rajat Kumar Conduct Meet The Press Program - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికలు లేకుండా ఏ మంత్రి పిల్లలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం లేదని  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంట్‌డౌన్ ప్రారంభమయిన సందర్భంగా సీఈవో శుక్రవారం ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రామాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రాముఖ్యత, ఏర్పాట్లు, ఓటింగ్‌ కార్యక్రమాల గురించి మాట్లాడారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 324 - 329 వరకు రాజ్యాంగంలో ఎన్నికల గురించి పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల కమిషన్ ఏర్పాటు, చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ నియామకం గురించి వివరించారు. ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికలు ఉండాలన్నారు. మొగలులు, చంద్రగుప్తుల కాలం నుంచే అధికారం గురించి ఉందని గుర్తు చేశారు. ఓటర్ల జాబితా సక్రమంగా లేకపోతే నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరగదని తెలిపారు. ఎన్నికల అధికారికి రెండు అంశాలు ముఖ్యమన్నారు. ఒకటి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.. రెండు ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు.

1950 నుంచే పింక్‌ బ్యాలెట్‌ పేపర్లు..
ఎన్నికల కమిషన్ 1950 నుంచి పింక్ బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తుందని తెలిపారు. ఇప్పుడు ఆ రంగు వాడకం పై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈనెల 19 వరకూ ఓటు నమోదుకు అప్పిలేట్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఎన్నికలను చాలా ఛాలెంజ్‌గా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయని వివరించారు. స్వాతంత్ర్యం తర్వాత రాజులు పోయారు, రాజ్యాలు పోయి ఎన్నికలు వచ్చాయన్నారు. గతంలో పోలింగ్ భూత్‌లను ఆక్రమించే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. డబ్బు ప్రమేయం తగ్గించేందుకు ఎన్నికల నిబంధనలు చాలా ఉన్నాయ్. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం తగ్గించేందుకు వ్యవస్థలో మార్పు రావాలని తెలిపారు. ఎన్నికలు లేకుండా ఏ మంత్రి పిల్లలు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కావడం లేదని గుర్తు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఒకే రోజులో మార్పు రావాలంటే కష్టమన్నారు. అలా కోరుకుంటే నిరీక్షణ తప్పదని వ్యాఖ్యానించారు.

ఎన్‌ఆర్‌ఐలకు ఓటేసే అవకాశం లేదు...
ఎన్నికలు ముగిసిన 45 రోజుల తర్వాత ఎవరైనా ఎలక్షన్ పీటీషన్ దాఖలు చేయవచ్చని తెలిపారు. అఫిడవిట్‌లో ఎవరైనా అభ్యర్థి ఒక కాలమ్ నింపకుండా ఉంటే ఆర్వో లిఖిత పూర్వకంగా అభ్యర్థికి చెప్పాల్సి ఉంటుందన్నారు. ఎన్నారై ఓటు నమోదుకు అవకాశం ఇచ్చాం.. కానీ తక్కువ మంది నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఎన్నారైలకు ఓటేసే అవకాశం లేదని తెలిపారు. వెబ్ కాస్టింగ్ లైవ్ ఉంది. సర్వీసు లేని ప్రాంతాల్లో రికార్డింగ్ చేస్తాం. పోలింగ్ సిబ్బంది కదలికలు పరిశీలిస్తామన్నారు. తమిళనాడులో 700 కోట్లు ఎన్నికల్లో సీజ్ చేసిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. సీఈఓపై పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. కానీ తనపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా పని చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులు వస్తే అధికార పార్టీ నాయకులపై కూడా కేసులు పెడుతున్నామని తెలిపారు.

ఎవరికి ఓటు వేయాలో ఓటరుకు తెలుసు...
సిటీలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. ఇక్కడ 50, 55 శాతానికి మించి నమోదు కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ సారి ఎన్నికల్లో యూత్‌ను టార్గెట్ చేశామని తెలిపారు. గతంలో కంటే ఈసారి 120 శాతం యువత ఓట్ల నమోదుకు ముందుకు వచ్చారని అభినందించారు. పోలింగ్ రోజు వ్యాపార వాణిజ్య సంస్థలు సెలవు ఇవ్వకపోతే నేరంగా పరిగణిస్తామని హచ్చరించారు. ఎన్నికల కేసులు పెట్టిన తర్వాత 50 శాతం కేసుల్లో రెండు వైపులా కాంప్రమైజ్ అవుతున్నాయన్నారు. మిగతా కేసుల్లో శిక్షలు పడుతున్నాయని తెలిపారు. ఓటుకు నోటు కేసు పై తనకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. రంగుల వల్ల ఏమి కాదు, ఓటర్లకు తెలుసు ఎవరికి ఓటు వేయాలో అని వ్యాఖ్యనించారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఆన్‌లైన్ ఓటింగ్‌ సదుపాయం కల్పించే అంశంపై చర్చ జరగాలని కోరారు. దీనిపై ఈసీఐ దృష్టి సారించేలా జర్నలిస్టులు కృషి చేయాలని వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top