
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పరిశీలన జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి అధికారుల బృందం రాష్ట్రానికి రానుంది. ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎం యంత్రాల సంసిద్ధత, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తదితర అం శాలపై పరిశీలన జరపడంతోపాటు రాజకీయ పార్టీ ల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌తో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది.
22న మధ్యాహ్నం 3.15 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం.. అదే రోజు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించనుంది. అనంతరం సాయంత్రం 7.30 నుంచి 8.30 వరకు సీఈఓ రజత్‌కుమార్, పోలీసు విభాగం నోడల్ అధికారి, అదనపు డీజీ జితేందర్‌రెడ్డిలతో భేటీ అయి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. 23న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనుంది. 24న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్ జనరల్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో సమావేశమై ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోనుంది. అనంతరం ఉదయం 11.15 నుంచి 12 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో సమావేశం కానుంది. మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంట వరకు విలేకరుల సమావేశం నిర్వహించి న అనంతరం సాయంత్రం 4.40 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ వెల్లడైన నేపథ్యంలో ఈ బృందం సమర్పించే నివేదిక ఆధారంగా ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. రాష్ట్ర శాసనసభ రద్దు అయిన అనంతరం ఈసీ అధికారుల బృందం రాష్ట్ర పర్యటనకు రావడం ఇది రెండో సారి.
పూర్తి అవగాహనతో రండి: కలెక్టర్లతో సీఈఓ
కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం నిర్వహించే సమావేశానికి పూర్తి అవగాహనతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్లకు సీఈఓ రజత్‌కుమార్ ఆదేశించారు. ఈసీ బృందంలోని అధికారులు అడిగే ఏ ప్రశ్నకైనా తక్షణమే సమాధానం ఇచ్చేలా అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహనతో సమావేశానికి రావాలని సూచించారు. రాష్ట్ర పర్యటనకు ఈసీ బృందం వస్తున్న నేపథ్యంలో మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసీ బృందం నిర్వహించే సమావేశంలో కలెక్టర్లు ఎవరైనా సమాధానాలు ఇవ్వడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఈఓ హెచ్చరించినట్లు తెలిసింది.