కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి 

Central Election Commission is satisfied says OP Ravat - Sakshi

అధికారులతో ఓపీ రావత్‌ వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు, సిబ్బంది సన్నద్ధత పట్ల కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఢిల్లీ నుంచి పాల్గొన్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఒ.పి.రావత్‌ ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రజత్‌కుమార్‌ను అభినందించారు. అవసరమయినప్పుడు ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసాతోపాటు తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, జరిగేలా చూడాల న్నారు. అక్రమంగా డబ్బు, మద్యం, మత్తుపదార్థాలు రవాణా కాకుండా చూడాలని, ఓటర్ల అక్రమ తరలింపుపై నిఘా ఉంచాలని రావత్‌ ఆదేశించారు. 

ఇదే అంశంపై రజత్‌కుమార్‌ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఇప్పటికే పటిష్టమైన నిఘా ఉంచామని, తీవ్రవాదుల కార్యకలాపాలు, మద్యం, డబ్బు తదితరాల రవాణాను నిశితంగా పరిశీలిస్తున్నామనీ, ఈ విషయంలో పొరుగు రాష్ట్రాల అధికారుల నుంచి మంచి సహకారం అందుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యంగా నక్సలైట్ల విషయంలో పోలీసుశాఖ అప్రమత్తంగా ఉందని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top