దేశంలో దుర్మార్గపు పాలన సాగుతోంది | Bv raghavulu commented over bjp and trs | Sakshi
Sakshi News home page

దేశంలో దుర్మార్గపు పాలన సాగుతోంది

Sep 17 2018 1:39 AM | Updated on Sep 17 2018 1:39 AM

Bv raghavulu commented over bjp and trs - Sakshi

కామారెడ్డి టౌన్‌: దేశంలో దుర్మార్గపు పాలన సాగుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమృత గ్రాండ్‌ హోటల్‌లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి రావడం కోసం దళితులు, గిరిజనులు, మహిళలకు కొన్ని తాయిలాలు ప్రకటించి మోసం చేస్తోందన్నా రు. శనివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ సభలో ఇంధన ధరల పెంపు, జీఎస్టీ, ప్రజల ఇబ్బందుల గురించి అమిత్‌ షా మాట్లాలేదన్నారు. సెప్టెంబర్‌ 17న ఏ హక్కుతో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతుందని ప్రశ్నించారు.

కార్పొరేట్‌ శక్తులకు వత్తాసు..
బీజేపీ పాలనలో రూపాయి మారకం విలువ రోజు రోజుకూ క్షీణిస్తోందని రాఘవులు పేర్కొన్నారు. ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టకుండా పరోక్షంగా కార్పొరేట్‌ శక్తులకు వత్తాసుపలుకుతోందని విమర్శించారు. అర్థిక విధానాల్లో కాంగ్రెస్, బీజేపీలకు తేడా లేదన్నారు. కాంగ్రెస్‌ అవినీతిపై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన మోదీ.. నాలుగున్నరేళ్లలో అవినీతిపరులను శిక్షించకపోగా.. విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీ, చోక్సీలాంటి ఆర్థిక నేరగాళ్లను దేశం దాటించారన్నారు. మాల్యా దేశం విడిచి వెళ్లడానికి మోదీకి అతి దగ్గరైన ఓ సీబీఐ అధికారి సహకరించారని మీడియాలో వార్తలు వచ్చాయన్నారు.

పార్లమెంట్‌ వ్యవస్థను నీరుగారుస్తున్నారు
బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ వ్యవస్థను నీరుగారుస్తోందని రాఘవులు ఆరోపించారు. రాజ్యసభలో చర్చ జరగనీయకుండా కీలక బిల్లులను ద్రవ్యబిల్లులుగా తీసుకొచ్చారన్నారు. విప్లవ రచయితలు, ప్రజా స్వామ్యవాదులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు. అందుకే బీజేపీ వ్యతిరేక ఓట్లను సమీకరించి ఆ పార్టీని ఓడించే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మతోన్మాదానికి వత్తాసు పలుకుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇద్దరు చంద్రులను నమ్మొద్దు
తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు నాయుడులను ప్రజలు నమ్మవద్దని రాఘవులు కోరారు. తెలంగాణలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశారన్నారు. బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తామని, ఇద్దరు చంద్రులనూ ఓడిస్తామని అన్నారు. ఎన్నికల పొత్తుల విషయంలో ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

మూడంచెల ఎత్తుగడ: తమ్మినేని
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను బట్టి మూడంచెల ఎత్తుగడ అవలంబిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, సీపీఎం భాగస్వామ్య బీఎల్‌ఎఫ్‌తో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తామని అన్నారు.

ఎక్కడైతే సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ బలహీనంగా ఉన్నాయో ఆ స్థానాల్లో పోటీలో ఉండకుండా టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఇతర పార్టీలకు సహకరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్‌ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, జ్యోతి, పోతునేని సుదర్శన్, సాయిబాబు, చుక్కరాములు, భాస్కర్, వెంకట్‌రాములు, 31 జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement