స్విస్‌ చాలెంజ్‌తో భారీ అవినీతి: బుగ్గన | Sakshi
Sakshi News home page

స్విస్‌ చాలెంజ్‌తో భారీ అవినీతి: బుగ్గన

Published Fri, Jul 26 2019 3:44 PM

Bugana Says Massive Corruption With Name Of Swiss Challenge - Sakshi

సాక్షి, అమరావతి : స్విస్‌ చాలెంజ్‌ పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. మౌలిక సదుపాయలు, న్యాయ పారదర్శకత సమీక్ష బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన గత ప్రభుత్వం చేసిన అవినీతిని తెలియజేస్తూ... బిల్లు ఆవష్యకతను వివరించారు. ఇది జ్యూడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు అని స్పష్టం చేశారు. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో ఈ కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.100 కోట్లకు పైబడిన పనులన్నీటిపై జ్యూడిషియల్‌ కమిషన్‌ పరిశీలన ఉంటుందని తెలిపారు. స్విస్‌ చాలెంజ్‌ పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేశారని తెలిపారు. గత ఐదేళ్లలో జరిగింది ఐకానిక్‌ అభివృద్ధి కాదని, ఐకానిక్‌ అవినీతన్నారు.

జగన్‌ సర్కార్‌ చారిత్రాత్మక అడుగు..
అవినీతిపై పోరాటంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చారిత్రాత్మక అడుగువేసింది. అక్రమాలను పూర్తి స్థాయిలో నిరోధించాడానికి జ్యూడిషియల్‌ కమిషన్‌ బిల్లును తీసుకొచ్చింది. టెండర్‌ విలువ రూ.100 కోట్లు దాటే పనులన్నీ ఈ కమిషన్‌ పరిధిలోకి రానున్నాయి. అన్ని మౌలిక సదుపాయల ప్రాజెక్టుల టెండర్లు ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. టెండర్లు పిలవడానికి ముందే పీపీపీలు జడ్జి పరిశీలనకు వెళ్లనున్నాయి. జాయింట్‌ వెంచర్లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ కూడా కమిషన్‌ పరిధిలోకి రానున్నాయి. కమిషన్‌ జడ్జికి నిపుణుల సలహా, సూచనలు తీసుకునే అధికారం ఉంది. జడ్జి సిఫారసులు తప్పనిసరిగా సంబంధిత శాఖ పాటించేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. ఈ బిల్లు ద్వారా ఏ టెండర్‌ అయినా తొలుత పారదర్శకంగా ప్రజల ముందుకు వస్తుంది. వారం తర్వాత టెండర్‌ వివరాలు జడ్జి ముందుకు వెళ్తాయి. కమిషన్‌ ఏర్పాటైన తర్వాత ఏ టెండర్‌ అయినా 15 రోజుల్లో ఖారారయ్యేలా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు వచ్చేలా ఈ బిల్లును రూపొందించారు.

Advertisement
Advertisement