కావాలనే ఆ నగరాన్ని టీడీపీ అభివృద్ధి చేయలేదు

Buggana Rajendranath Reddy Reply on IT Industries in Assembly - Sakshi

విభజన తర్వాత వైజాగ్‌లో ఐటీ అభివృద్ధికి అవకాశం

ఐనా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఐటీ రంగాన్ని తామే అభివృద్ధి చేశామని, ఐటీని కనిపెట్టామని టీడీపీ వాళ్లు చెప్పుకుంటున్నారని, కానీ, గత టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే వైజాగ్‌ నగరం ఐటీపరంగా ఎంతోకొంత అభివృద్ధి చెంది ఉండేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఐటీ పరిశ్రమల గురించి ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఐటీ పరిశ్రమకు తగిన ప్రదేశంగా వైజాగ్‌ ఉన్నప్పటికీ.. ఆ నగరంలో ఐటీని ఉద్దేశపూర్వంగా అభివృద్ధి చేయలేదని గత ప్రభుత్వం తీరును బుగ్గన తప్పుబట్టారు. వైజాగ్‌ను అభివృద్ధి చేసే ఉద్దేశమే గత ప్రభుత్వానికి లేదన్నారు. తమకు నచ్చినచోట ఐటీ కంపెనీలు పెట్టాలని టీడీపీవాళ్లు కోరారని, కానీ, అక్కడ తగిన వాతావరణం లేకపోవడంతో ఐటీ కంపెనీలు రాలేదన్నారు.

ఇక, ఐటీ రంగానికి చంద్రబాబు సర్కారు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు.. చేసిన ఖర్చు గురించి ఆయన సభలో వివరించారు. 2018-19 సంవత్సరానికి రూ. వెయ్యి ఆరు కోట్లు కేటాయించినప్పటికీ దాదాపు 400 కోట్లు మాత్రమే ఐటీ కోసం ఖర్చు చేశారని, తాము రూ. 453 కోట్లు కేటాయించామని, ఇందులో తక్కువ ఏముందని బుగ్గన ప్రశ్నించారు. 

ఐటీనీ తామే కనిపెట్టామని, కంప్యూటర్‌నూ, సెల్‌ఫోన్‌నూ తామే కనిపెట్టామని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారని, అంతేకాకుండా వాళ్ల ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రి కూడా చాలా ముఖ్యమైన మనిషి అని పరోక్షంగా నారా లోకేశ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రపంచానికి టెక్నాలజీ నేనే నేర్పించానని చంద్రబాబు ఇదే సభలో గొప్పలు చెప్పుకున్నారని గుర్తు చేశారు. ప్రకృతితో యుద్ధమని, హుదూద్‌ మనల్నిచూసి భయపడుతోందని చంద్రబాబు ఆనాడు పేర్కొన్న వ్యాఖ్యలను ప్రస్తావించారు. 

2014-15లో ఐటీ రంగానికి ఇన్సెంటివ్‌గా రూ.  2 కోట్ల 12 లక్షలు కేటాయించి.. ఒక కోటి 12 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని, 2015-16లో రూ. 3.25 కోట్లు కేటాయించి.. కోటి 24 లక్షలు ఖర్చు చేశారని, 2016-17లో రూ. 25 కోట్లు కేటాయించి.. 2.30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, 2017-18లో మళ్లీ రూ. 25 కోట్లు కేటాయించి.. రూ. 15.64 లక్షలు ఖర్చు చేశారని తెలిపారు. 2018-19 ఎన్నికల సమయం కావడంతో అన్ని కేటాయింపులు హై లెవల్‌లో చూపించారని, ఇందులో భాగంగా ఆ సంవత్సరం 450 కోట్లు కేటాయించి దాదాపు 18 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. ఐదు సంవత్సరాలకుగాను ఐటీ పరిశ్రమల ఇన్సెంటివ్‌ కోసం రూ. 35 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు వాస్తవాలు తెలుసుకోకుండా అమాయకంగా ప్రశ్నలు అడుగుతూ.. నిజాలు తెలుసుకొని బాధపడుతున్నారని చురకలు అంటించారు.


ఐటీ పరిశ్రమల కోసం సమగ్ర విధానం: గౌతంరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు, ఐటీ పెట్టుబడులు రాబట్టేందుకు త్వరలో సమగ్రమైన విధానాన్ని తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగినంతగా మౌలిక వసతులు కల్పించలేదని, విధాన నిర్ణయాల్లో సంక్లిష్టతల వల్ల ఐటీ పరిశ్రమలకు అంతగా అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడలేదని ఆయన తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ఐటీ పరిశ్రమలు, ఉద్యోగాల విషయమై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top