
హైదరాబాద్‌ను కట్టింది చంద్రబాబేనట.. అటువంటి వ్యక్తి ఐదేళ్లలో అమరావతిని ఎందుకు కట్టలేకపోయారు?
సాక్షి, హైదరాబాద్: కమిషన్ల కోసమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మాణ బాధ్యతలు చేపట్టారని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఎలా చేతులు కలుపుతారని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్నవి ధర్మ పోరాట దీక్షలు కాదని.. అధర్మ పోరాట దీక్షలని ఆక్షేపించారు.
చంద్రబాబు ఏ దేశానికి వేళ్తే.. ఏపీ రాజధానిని ఆ దేశంలా చేస్తానంటూ గొప్పలు చెబుతారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను కట్టింది చంద్రబాబేనట.. అటువంటి వ్యక్తి ఐదేళ్లలో అమరావతిని ఎందుకు కట్టలేకపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటివరకు అమరావతిలో ఒక్క శాతం పనులు కూడా జరగలేదని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలున్నాయా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతూ నిధులను పక్కదారి పట్టించారని మిమర్శించారు.
నీరుచెట్టు పేరుతో నిధులు దోపిడి చేశారని తెలిపారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని అన్నారు. అనుకూల పత్రికల్లో అమరావతికి సంబంధించిన ప్రచారం చేయించుకుంటున్నారని మండిపడ్డారు. పొంతన లేని యాడ్స్‌తో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.