‘అవిశ్వాసం’పై నాడు, నేడు కేంద్రం వైఖరి

BJP Strategy On No-Confidence - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ తదితర పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అనుమతించలేదు. సభ సవ్యంగా నడవడం లేదని, గందరగోళ పరిస్థితుల మధ్య అవిశ్వాసాన్ని అనుమతించలేనని అందుకు ఆమె సాకు కూడా చెప్పారు. మళ్లీ ఇప్పుడు వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిందే తడవుగా లోక్‌సభ స్పీకర్‌ అందుకు అనుమతించారు. ఎందుకు? నాటికి నేటికి మారిన పరిస్థితులు ఏమిటీ?

నాడైనా, నేడైనా అవిశ్వాస తీర్మానం కారణంగా మోదీ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు లేవు. నాడు తెలుగు దేశం పార్టీ అప్పుడే ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇది కొంత పాలకపక్ష బీజేపీకి అసంతృప్తి కలిగించే అంశమే. ప్రతిపక్షాల మధ్య కొంత గందరగోళ పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఎందుకంటే అవి తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగానే కేంద్రంపై అవిశ్వాసానికి ముందుకు వచ్చాయి. కావేరీ నుంచి తమిళనాడుకు ఒక్క చుక్క నీరు కూడా ఇచ్చేది లేదంటూ కర్ణాటక పాలక, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. సమీపంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అవిశ్వాసాన్ని అనుమతిస్తే పరువు పోగొట్టుకొని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ భయపడింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా గురించి నిలదీస్తే  సరైన సమాధానం చెప్పలేక తడబడాల్సి వస్తుందన్న ఆందోళన. అప్పుడు అవిశ్వాసంపై చర్చకు ప్రాంతీయ పార్టీలే ముందున్నాయి.

ఇప్పుడు పరిస్థితి మారింది. అవిశ్వాసంపై చర్చకు కాంగ్రెస్‌ పార్టీయే ముందుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి ప్రత్యామ్నాయంగా తన నాయకత్వాన ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలన్న సంకల్పం నుంచి వచ్చింది కాంగ్రెస్‌కు ఈ చొరవ. అందుకని అవిశ్వాసంపై జరిగే చర్చలో కాంగ్రెస్‌ పార్టీని దీటుగా ఎదుర్కొనగలిగితే ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని సగం దెబ్బతీసినట్లే అవుతుందన్నది బీజేపీ వ్యూహం. ఈ విషయాన్ని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పలువురు బీజేపీ నాయకులు ధ్రువీకరించారు. వారికి తమ నాయకుడు నరేంద్ర మోదీ ప్రసంగం లేదా వాగ్వాద నైపుణ్యంపై ఎంతో నమ్మకం ఉంది. కాంగ్రెస్‌ ముస్లిం పురుషులను మెప్పించే పార్టీ అనే ప్రచారం, తలాక్‌కు వ్యతిరేకమంటూ ధ్వజమెత్తడం ద్వారా ఆ పార్టీని సులభంగానే ఎదుర్కోవచ్చని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. లోక్‌సభ ఆమోదం పొందిన తలాక్‌ బిల్లు రాజ్యసభలో కాంగ్రెస్‌ వైఖరి కారణంగా ఆమోదం పొందని విషయం తెల్సిందే.

కశ్మీర్‌లో టెర్రరిస్టులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న కఠిన వైఖరి కూడా తమకు ఎంతో ఉపయోగ పడుతుందని బీజేపీ భావిస్తోంది. టెర్రరిస్టులను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతోనే ముఫ్తీ మెహబూబా ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకున్నామన్న ప్రచారం కూడా తమకు బాగానే ఉపయోగ పడుతుందన్న ఆలోచన. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అవిశ్వాసాన్ని తిరస్కరించి అభాసుపాలవడం కంటే ఆమోదించి ఎదుర్కోవడమే ఉత్తమమని అభిప్రాయానికి వచ్చింది. అవిశ్వాసాన్ని నెగ్గడం ద్వారా ప్రతిపక్షాన్ని దూషించి ప్రజల మన్ననలను పొందవచ్చు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న పై మూడు రాష్ట్రాల ఎన్నికల్లో పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమూ కావచ్చు అన్నది బీజేపీ వ్యూహంలో భాగం.
 
అందుకనే అవిశ్వాసంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘చర్చ నుంచి పారిపోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని చూస్తున్నాం. ప్రతిపక్షాల అబద్ధాలకు అడ్డుకట్ట వేయదల్చుకున్నాం. ఏ ప్రశ్ననైనా ఎదుర్కోవడానికి, దానికి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. దేశంలో నెలకొన్న అస్తవ్యస్థ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న నిరుద్యోగం, గోసంరక్షకుల దాడులు, పిల్లల కిడ్నాపర్ల పేరిట అల్లరి మూకల హత్యలు, మహిళలపై అత్యాచారాలు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ నిలదీయవచ్చు. అయితే అందులో ఎంత మేరకు విజయం సాధిస్తుందన్నది ప్రశ్న.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top