17న ‘ఊరినిండా జాతీయ జెండా’

BJP Plans To Celebrate Telangana Vimochana Dinotsavam - Sakshi

విమోచన దినోత్సవ నిర్వహణకు బీజేపీ ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా ‘బండెనుక బండి కట్టి’పాటను రాసిన బండి యాదగిరి విగ్రహాన్ని తిరుమలగిరిలో ఈ నెల 9న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆవిష్కరించారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తూ ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టింది. రజాకార్ల వ్యతిరేక పోరాటాలు జరిగిన, చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచిన స్థలాలను సందర్శిస్తోంది, సమావేశాలు నిర్వహిస్తోంది. రజాకార్లు 16 మందిని హత్య చేసిన మహబూబాబాద్‌ జిల్లాలోని దేవుని సంకీసలో సమావేశం నిర్వహించింది. 14న నిజామాబాద్‌ జిల్లాలో విమోచన దినోత్సవ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 16న బైరాన్‌పల్లిలో పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అదే రోజు మహబూబ్‌నగర్‌ జిల్లా అప్పంపల్లిలో, ఆసిఫాబాద్‌ జిల్లాలో, నిర్మల్‌ జిల్లా వేయి ఊరుల మర్రిలో, ఖమ్మం జిల్లా ఎర్రుపాళెంలో కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టింది. వాటిల్లో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొనేలా చర్యలు చేపట్టింది.  

అన్ని బూత్‌ల్లో విమోచనకు ఏర్పాట్లు 
17న ఊరినిండా జెండాలు కార్యక్రమం పేరుతో ప్రతి గ్రామంలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల్లో విమోచన దినోత్సవాలు నిర్వహించాలని, అందులో భాగంగా ఉదయం 9 గంటలకు జాతీయ జెండాలు ఆవిష్కరించాలని నిర్ణయించామని బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్‌ శ్రీవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో త్రివర్ణ పతాకాలతో బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు పటాన్‌చెరులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు. సభకు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, కిషన్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. హోంశాఖ మంత్రి అమిత్‌షా అధికారిక కార్యక్రమాల కారణంగా 17వ తేదీన రాలేకపోతున్నారని, ఆ తరువాత రాష్ట్ర పర్యటనకు వస్తారని వివరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top