సొమ్ము కేంద్రానికి సోకు రాష్ట్రానిది ! | Sakshi
Sakshi News home page

సొమ్ము కేంద్రానికి సోకు రాష్ట్రానిది !

Published Wed, Apr 25 2018 12:26 PM

BJP Leader Laxman Criticize On CM KCR - Sakshi

పెర్కిట్‌(ఆర్మూర్‌): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సొమ్ము ఒకరిది సోకు ఒకరిది తరహాలో ప్రవర్తిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని క్షత్రియ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న బీజీపీ తొమ్మిది జిల్లాల మండల అధ్యక్షులు, ఇన్‌చార్జుల కార్యశాల ముగింపు కార్యక్రమానికి మంగళవారం లక్ష్మణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు, పథకాలను తమ ప్రగతిగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉందని చూడకుండా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి విశేషంగా నిధులను కేటాయిస్తోందన్నారు.  కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో రాష్ట్రానికి మంజూరు చేసిన నిధులపై చర్చలకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.

అలాగే అధికార యావతో విధివిధానాలు లేని పార్టీలు కులం, మతం, ప్రాంతాల విభజనల పేరుతో రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీలు కూటమిగా మారి కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొడతారన్నారు. స్వార్థ రాజకీయాలతో సీఎం కేసీఆర్‌ థర్డ్‌ ప్రంట్, ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ తెర లేపుతున్నారన్నారు. ఏపీలో సైతం సీఎం చంద్రబాబు వైఖరీ అలాగే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తోందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్‌ నుంచి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో 50 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సభలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ ప్రగతి గురించి ప్రజలకు తెలియజేస్తామన్నారు. సమావేశంలో బీజేపీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు పల్లె గంగా రెడ్డి, బాణాల లక్ష్మా రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్జాపూర్‌ శ్రీనివాస్, ఆలూర్‌ గంగా రెడ్డి, పుప్పాల శివరాజ్, పెద్దోళ్ల గంగా రెడ్డి, మురళిధర్‌ గౌడ్, నూతుల శ్రీనివాస్‌ రెడ్డి, బీజేపీ ఆర్మూర్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ద్యాగ ఉదయ్, పూజ నరేందర్, పోల్కం వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement