
గుజరాత్ అసెంబ్లీలో దాడి చేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు
గాంధీనగర్ : సమీక్షలు, చర్చలు అనేవి ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. అలాంటిది ప్రజా సమస్యలు చర్చించడం పక్కనపెట్టిన ప్రజా ప్రతినిధులు అసెంబ్లీల్లో తన్నుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రం అయిన గుజరాత్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతం అయింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరినొకరు తొలుత దూషించుకుంటూ నువ్వెంత నువ్వెంత అనుకుంటూ ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. చూస్తుండగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వ్యక్తిగత విమర్శలకు పోయి అసెంబ్లీలో కొట్టుకొని సభా గౌరవాన్ని తుంగలో తొక్కారు.
వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ దుదత్, బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్ పాంచల్ తొలుత బుధవారం అసెంబ్లీలో గొడవకు దిగారు. బయటకు చెప్పవీలుకాని భాషలతో ఒకరినొకరు తిట్టుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు దాదాపు పిడిగుద్దులు గుప్పించుకున్నారు. వారిద్దరిని వారించేందుకు ఇరు వర్గాల వారు ఎంత ప్రయత్నించినా ఆగలేదు. పైగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా తమ ఎమ్మెల్యేను తిట్టిన బీజేపీ ఎమ్మెల్యేతో వెంటనే క్షమాపణ చెప్పించాలంటూ స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. దీంతో వారిద్దరిని కూడా మార్షల్ ద్వారా బయటకు గెంటేసి సస్పెన్షన్ చేశారు.