దళారీల నాయకుడు చంద్రబాబే | Bhumana fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

దళారీల నాయకుడు చంద్రబాబే

Jun 6 2018 3:19 AM | Updated on Aug 14 2018 11:26 AM

Bhumana fires on CM Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసు ముఖ్యమంత్రి చంద్రబాబు నిజస్వరూపాన్ని దేశవ్యాప్తం చేస్తే ఎయిర్‌ ఏషియా కుంభకోణం ఆయన అవినీతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిందని వైఎస్సార్‌ సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు దళారీలకు నాయకత్వం వహించాల్సిన వ్యక్తని ప్రపంచానికి తెలిసిపోయింది. ‘బాబులా వ్యవస్థలను మేనేజ్‌ చేయగల వ్యక్తి మరెవరూ లేరు. ఎయిర్‌ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై 2  రోజులుగా జాతీయ పత్రికలు కోడై కూస్తున్నా, ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా రాష్ట్రంలో బాబుకు భజన చేసే ఓ వర్గం మీడియా సంస్థలు ఒక్క వార్త కూడా రాయకుండా, చూపకుండా దాచిపెట్టాయి.’ అంటూ భూమన ధ్వజమెత్తారు. భూమన మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

మద్యం ముట్టలేదా బాబూ?
‘చంద్రబాబు తాను ఎన్నడూ మద్యం ముట్టలేదని నవనిర్మాణ దీక్షల్లో చెప్పటం విడ్డూరంగా ఉంది. అత్తమ్‌ నరసింహులు బహుశా ఇప్పుడు బాబుకు  గుర్తుంటారో లేదో తెలియదు. కాలేజీ చదివే రోజుల్లో చిన్న దుకాణం నడిపే నరసింహులు ద్వారా చేసిన తతంగాలను చంద్రబాబు గుర్తు తెచ్చుకోవాలి. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల పక్కన బాలాజీ కాలనీలో చిన్న దుకాణం నడిపే చలమయ్యను అడిగితే చంద్రబాబు విద్యార్థి దశలో చేసిన వ్యవహారాల గురించి కథలు పుంఖానుపుంఖాలుగా చెబుతారు.

మద్యాన్ని ముట్టలేదని చెప్పే బాబు గురించి అప్పట్లో తిరుపతి చిన్నబజారులో ఉన్న వినాయక బ్రాందీ షాప్‌ ఓనర్‌ దగ్గరకు వెళ్తే చెబుతారు. చంద్రబాబు గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు.. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యార్థి దశ నుంచి ఆయన చేసిన సరస సల్లాపాలు మొదలు మద్యం దుకాణాలవైపు మరిగిన వరకూ తెలుసు’ అని భూమన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement