లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. లగడపాటి మాట నమ్మి సర్వనాశనమైపోయామని తనతో చాలా మంది చెప్పారన్నారు. ప్రజల నాడీ లగడపాటికి ఏం తెలుసు అని ప్రశ్నించారు.
‘ప్రజల నాడీ తెలిసినోడు ఎగ్జిట్ పోల్ చేయాల. ప్రతి ఒక్కరూ సర్వేలు చేసేస్తే ప్రమాదం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్‌తో ప్రజలు కొన్ని కోట్ల రూపాయాలు నష్టపోయారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు పందేలు కాశారు. వాళ్లంతా సర్వనాశనమైపోయార’ని అయ్యన్నపాత్రుడు అన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేస్తుంటే మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఓటమిని ఆయన చెప్పకనే చెప్పారని ప్రత్యర్థులు అంటున్నారు. (చదవండి: ఆంధ్రాలో జగన్ అద్భుత విజయం)


