ముగిసిన పంచాయితీ.. సుబ్బారెడ్డి అసంతృప్తి

AV Subba Reddy And Akhila Priya Conflicts Gets End - Sakshi

సుబ్బారెడ్డి డిమాండ్లను పట్టించుకోని సీఎం చంద్రబాబు

ఈ వివాదం టీ కప్పులో తుపాన్ వంటిది: వర్ల రామయ్య

మాకు చంద్రబాబు అండగా ఉంటామన్నారు: అఖిలప్రియ

సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఆళ్లగడ్డ పంచాయితీపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మీడియా సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే సుబ్బారెడ్డి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించారు. తనపై రాళ్ల దాడి చేయించిన రాష్ట్ర మంత్రి అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు తన డిమాండ్‌ను పట్టించుకోలేదని, తన ఆవేదనను అర్థం చేసుకోలేదంటూ సుబ్బారెడ్డి అసహనంతో ఉన్నారు. తన మాట చంద్రబాబు పట్టించుకోకపోవడంపై కినుక వహించిన సుబ్బారెడ్డి మీడియా సమావేశం జరుగుతుండగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పార్టీ అభివృద్ధికి తాను ఎప్పటిలాగే కృషి చేస్తానని సుబ్బారెడ్డి తెలిపారు.

కాగా, ఆళ్లగడ్డ విభేదాలపై సీఎం చర్చించారని, ఈ వివాదం టీ కప్పులో తుపాన్ వంటిదని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ.. వివాదాలు వద్దని, అభివృద్ధిపై దృష్టి సారించమని చెప్పినట్లు తెలిపారు. చిన్న చిన్న విభేదాలు సహజమేనని, వాటిని సర్దుకుని పోవాలని చంద్రబాబు సూచించారు. ఏవీ సుబ్బారెడ్డితో కలిసి పిచేసేందుకు అభ్యంతరం లేదన్నారు. తమ కుటుంబానికి సీఎం చంద్రబాబు అండగా ఉంటామన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అఖిలప్రియ పేర్కొన్నారు. ఓవైపు సుబ్బారెడ్డి బాధగా కనిపించగా.. మరోవైపు అఖిలప్రియ మాత్రం తనను అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వివాదం ఏంటంటే..
సైకిల్‌ యాత్ర చేస్తున్న సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరగడంతో టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తన సమక్షంలో పంచాయితీకి అఖిలప్రియ, సుబ్బారెడ్డిలను ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన పంచాయితీకి అఖిలప్రియ గైర్హాజరు కాగా, శుక్రవారం రావాలని ఆదేశించారు. చంద్రబాబు సమక్షంలో అఖిలప్రియ, సుబ్బారెడ్డిల మధ్య రాజీయత్నం జరిగింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top