మాధవ్‌ రిలీవ్‌పై డీజీపీకి ఈసీ లేఖ

AP Chief Election Officer Letter To DGP Over Gorantla Madhav Relieving - Sakshi

డీజీపీకి ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది లేఖ

ఓటమి భయంతో టీడీపీ రాజకీయం చేస్తోంది

సీఎం చంద్రబాబే స్వయంగా అడ్డుకుంటున్నారు

వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ మండిపాటు

సాక్షి, అమరావతి/అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గోరంట్ల మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను ఆమోదించి వెంటనే రిలీవ్‌ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం డీజీపీకి లేఖ రాశారు. రాజకీయంగా తనను ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో వీఆర్‌ఎస్‌ను ఆమోదించడంలేదని మూడు రోజుల కిందట గోరంట్ల మాధవ్‌ ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన ట్రిబ్యునల్‌.. గోరంట్ల మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను వెంటనే ఆమోదించి నామినేషన్‌కు అడ్డంకులు లేకుండా రిలీవ్‌ చేయాలంటూ కర్నూలు డీఐజీని ఆదేశించిన సంగతి తెలిసిందే.

కానీ, రెండ్రోజుల నుంచి కర్నూలు డీఐజీ నాగేంద్రకుమార్‌ అందుబాటులో ఉండడంలేదు. ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గోరంట్ల మాధవ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. రాజకీయ కుట్రతోనే తన వీఆర్‌ఎస్‌ ఆమోదించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని, లేని కేసులు ఉన్నట్లు చూపించి పెండింగ్‌ పెట్టారని.. దీనిపై ట్రిబ్యునల్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని మాధవ్‌ ఎన్నికల అధికారికి వివరించారు. దీనిపై స్పందించిన ద్వివేది.. మాధవ్‌ను వెంటనే రిలీవ్‌చేసి నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని డీజీపీ ఠాగూర్‌కు లేఖ రాశారు.
(ఖాకీలే శత్రువులు !)

సీఎం ఒత్తిడి మేరకే ఆ ఇద్దరి కుట్ర 
కాగా, తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ అడ్డదారుల్లో ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని గోరంట్ల మాధవ్‌ ఆరోపించారు. తన వీఆర్‌ఎస్‌ ఆమోదం విషయంలో స్వయానా ముఖ్యమంత్రే జోక్యం చేసుకుని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ఒత్తిడి మేరకే ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కర్నూలు రేంజ్‌ డీఐజీ నాగేంద్రకుమార్‌ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల అధికారి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు డీజీపీని కలుస్తానన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top