అవినీతిలో తారాస్థాయికి టీడీపీ పాలన: ఆళ్ల నాని

Alla Nani Slams Chandrababu In Eluru - Sakshi

ఏలూరు: టీడీపీ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఆళ్లనాని తీవ్రంగా విమర్శించారు. ఏలూరు అశోక్ నగర్ లో దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, దెందులూరు కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆళ్లనాని విలేకరులతో మాట్లాడుతూ.. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ రౌడీయిజంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దళిత కార్మికుడిని కొట్టిన చింతమనేనిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్‌ చెయ్యలేదని సూటిగా అడిగారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి ప్రజలు 15 సీట్లు అప్పగిస్తే జిల్లా ప్రజలకి ఏం చేశారని ప్రశ్న లేవనెత్తారు. టీడీపీ పాలనలో జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్‌ అయినా వచ్చిందా..టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.

జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధులంతా దోపిడీలో ఆరితేరిపోయారు..మట్టి నుంచి ఇసుక వరకు దేన్నీ వదలడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అవినీతిపై ఎన్నిఆరోపణలు వచ్చినా చంద్రబాబు నిర్లక్ష్యంగా ఉన్నారని దుయ్యబట్టారు. 2018 నాటికి గ్రావిటీతో పోలవరం నుంచి నీరిస్తానన్న మాట ఏమైందని అడిగారు. వచ్చే ఎన్నికలలో 15 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు పశ్చిమ ప్రజలు అంతం పలకబోతున్నారని వ్యాఖ్యానించారు.

అబ్బయ్య చౌదరీ మాట్లాడుతూ.. చింతమనేని ప్రభాకర్‌ పాలనకు చరమగీతం పాడదామని పిలుపునిచ్చారు. నారా అంటే నరరూప రాక్షసుడని, రాష్ట్రంలో నరరూప రాక్షసుడి దుర్మార్గపు పాలనను అంతమొందించాలని ప్రజలను కోరారు. దెందులూరు నియోజకవర్గ ప్రజలు, తమ ఆత్మ గౌరవాన్ని చంపుకుని బతుకుతున్నారని, దెందులూరులో రౌడీపాలనను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఆరు నెలల్లో దెందులూరులో వైఎస్సార్సీపీ జెండా ఎగరబోతోందని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండేందుకే ఏలూరు అశోక్ నగర్లో దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. దెందులూరు ప్రజలకి ఏకష్టమొచ్చినా తాము అండగా ఉంటామని, సమస్య ఉన్న వారు ఒక్క ఫోన్ కాల్ చేయాలని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top