5 రోజులుగా నిరాహార దీక్ష : మంత్రి బరువు పెరిగారు!

After 5 Days Of Hunger Strike, Satyendra Jain Gains 1-5 Kg - Sakshi

న్యూఢిల్లీ : ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే.. ఎవరైనా తమ శక్తినంతా కోల్పోయి, బరువు తగ్గిపోతుంటారు. కానీ ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ చేస్తున్న నిరాహార దీక్షలో మాత్రం ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఐదో రోజులుగా దీక్ష చేపడుతున్నప్పటికీ, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ బరువు పెరిగారట. ఆయన 1.5 కిలోల బరువు పెరిగినట్టు రిపోర్టులు వెలువడ్డాయి. సత్యేంద్ర బరువు పెరగడంతో పాటు, సిసోడియా కూడా ఫిట్‌గా ఉన్నారని తెలిసింది. దీంతో పార్టీ నేతలపై ఆప్ తిరుగుబాటు ఎమ్మెల్యే కపిల్ మిశ్రా విరుచుకుపడ్డారు. తన ట్విటర్‌ అకౌంట్‌లో సిసోడియా, జైన్‌, కేజ్రీవాల్‌ దీక్షపై కామెంట్లు చేశారు. రుచికరమైన ఆహార పదార్థాలను వారు తింటున్నారని ఆరోపించారు. 

నకిలీ నిరసనతో ప్రజల్ని మోసం చేయొద్దన్నారు. సత్యేంద్ర జైన్‌ అకస్మాత్తుగా బరువు ఎలా పెరిగారని ప్రశ్నించిన మిశ్రా, వారు దీక్ష చేస్తున్న గదిలో సీసీటీవీ కెమెరాలను ఇన్‌స్టాల్‌ చేయాలని అనిల్‌ బైజాల్‌ను కోరారు. సత్యేంద్ర జైన్‌ బరువు గురువారం 80 కేజీలు కాగ, ఆ అనంతరం 81.5 కేజీలకు పెరిగినట్టు పేర్కొన్నారు. సత్యేంద్ర జైన్‌ మెడికల్‌ చెకప్‌ను నిరాకరించారని, నిరాహార దీక్షలో కూర్చుని ఆయన ఆహారాన్ని తీసుకుంటున్నారని కపిల్‌ మిశ్రా ఆరోపించారు. మనీష్‌ సిసోడియా కూడా ఫిట్‌గా ఉన్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు. రాష్ట్రం హక్కుల్ని కేంద్రం కాలరాస్తుందని, ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్‌ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్‌, మంత్రులు ఈ నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఆప్‌ నేతలు చేస్తున్న డిమాండ్ల కంటే కూడా ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ బరువుపైనే ప్రతి ఒక్కరూ దృష్టిసారించారు. మంత్రి బరువు పెరిగారనే విషయంపై ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top