88 సార్లు రాష్ట్ర ప్రభుత్వాల రద్దు

88 Times Cancellation Of State Governments By Congress said By Dattatreya - Sakshi

హైదరాబాద్‌ : 1951 నుంచి ఇప్పటి వరకు 88 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలను భ్రష్టు పట్టించిందని సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ విమర్శించారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. 1992 లో కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలను రద్దు చేసిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ ఎప్పుడూ రక్షించలేదని, కర్ణాటకలో కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారని అన్నారు. రాహుల్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, రాహుల్‌కి చిన్న మనసత్వం ఉందని ఎద్దేవా చేశారు.

ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బీజేపీని అధికారంలోకి రాకుండా చేస్తామని రాహుల్‌ అంటున్నారని, అది పగటి కలే అవుతుందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్‌కు గుబులు అని, ప్రాంతీయ పార్టీల సహకారం లేకపోతే దేశంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకపోయేదని అన్నారు. కాంగ్రెస్, జాతీయ పార్టీ లక్షణాన్ని కోల్పోయిందని, ఎన్నికల ముందు విమర్శించుకుని, తర్వాత ఫ్రంట్ అంటే దానికి విలువ లేదని వ్యాఖ్యానించారు.  యడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నం చేయడంలో తప్పు లేదని, తాము ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరినీ కిడ్నాప్‌ చేయలేదని వ్యాఖ్యానించారు.

‘  కర్ణాటక లో ఏర్పడే ప్రభుత్వం అనైతిక ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి ముందు ఉంది ముసళ్ల పండుగ. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కొని ఇప్పుడు చంద్రబాబు నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. దొడ్డి దారిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ కాంగ్రెస్‌కు దగ్గర అవుతున్నారు. కర్ణాటక ప్రభుత్వ ప్రమాణస్వీకరణకు టీఆర్‌ఎస్‌ ఏ రకంగా భాగస్వామ్యం అవుతుందో చెప్పాలి. జాతీయ పార్టీతోనే దేశ మనుగడ. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పధం ఉండదు. ప్రాంతీయ పార్టీలతో సుస్థిర పాలన కొనసాగదు. ఎంపీ కవిత ఆ విషయం గ్రహించాలి. తెలంగాణలో 2019లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులకు బీజేపీ గుణపాఠం చెబుతుంది’   అని హెచ్చరికలు పంపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top