రాష్ట్రంలో 32,796 పోలింగ్‌ కేంద్రాలు

32,796 polling stations in the state - Sakshi

ఓటర్ల జాబితాకు అనుగుణంగా పెరిగిన 222 కేంద్రాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో రాష్ట్రంలో అదనంగా 222 అనుబంధ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇక మొత్తం పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 32,574 నుంచి 32,796కు పెరిగింది. వీటిల్లో 10,280 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ అనుమతి కోరగా, ఈ మేరకు తాజాగా ఈసీఐ అనుమతినిచ్చింది.

ఈ నెల 19న రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది. శాసనసభ రద్దు ముందు వరకు రాష్ట్రంలో 2.73 కోట్ల పైచిలుకు ఓటర్లు ఉండేవారు. దీని ప్రకారం 32,574 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే తొలి, రెండు అనుబంధ ఓటర్ల జాబితాల ప్రచురణతో ఓటర్ల సంఖ్య 2.77 కోట్లను మించనుంది. దీంతో ఈ సంఖ్యకు అదనంగా మరో 222 పోలింగ్‌ కేంద్రాలను పెంచేందుకు ఈసీ నిర్ణయించింది. 3,800 పోలింగ్‌ కేంద్రాలతో హైదరాబాద్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 200 పోలింగ్‌ కేంద్రాలతో వనపర్తి జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

1,400 ఓటర్లకో పోలింగ్‌ కేంద్రం..
పట్టణ ప్రాంతాల్లో 1,400 ఓటర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో 1,200 ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈసీ ఆమోదం తెలిపింది. ఒకే కుటుంబంలోని వారందరికీ ఒకే పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇంటింటి ఓటర్ల వివరాలు, వారు ఓటు వేసే పోలింగ్‌ బూత్‌ వివరాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రజత్‌కుమార్‌ ఆదేశించారు.

ఆ పోలింగ్‌ స్టేషన్ల విలీనం వద్దు
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీస్‌ అధికారులను ఈసీ ఆదేశించినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఇతర పోలింగ్‌ కేంద్రాల్లో విలీనం చేయరాదని ఈసీ ఆదేశించినట్లు తెలిసింది. ఒక్కో పోలింగ్‌ కేంద్రాన్ని మరో పోలింగ్‌ కేంద్రంలో విలీనం చేయడమనేది కొంత వెసులుబాటును ఇస్తుందని అధికారులు భావించరాదని, దీనితో ఓటర్లు అయోమయానికి గురి అవుతారని పేర్కొంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల పోలింగ్‌ స్టేషన్లపై మ్యాపింగ్‌ చేసి పోలింగ్‌ కేంద్రాలకు తొందరగా ఓటర్లు వచ్చేలా చూడాలని ఆదేశించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top