ప్రపంచ శాంతి దినోత్సవం


‘శాంతి’ అన్న పదం వినటానికి కరువైన రోజులు దాపురించాయా? అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం మన దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా దాపురించింది. అంతర్గత కల్లోలాలు, పొరుగు దేశం పాకిస్తాన్ కలిగిస్తున్న ఇబ్బందులపై మన దేశం పెట్టిన ఖర్చు 2013లో 177 బిలియన్ల డాలర్లకి చేరింది. అంటే సుమారు 90% హెచ్చు ఒక సంవత్సరంలోనే జరిగింది. ఈ ఖర్చు మన జీడీపీలో సుమారు 4.7%. భద్రతా దళాల మోహరింపు ఈ పెరిగిన ఖర్చులకి కారణం. ఇటీవల ‘ప్రపంచ శాంతి సూచీ’పై సిడ్నీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్, పేస్(ఐఈపీ) నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశం మొత్తం 163 దేశాల్లో 143వ స్థానంలో ఉంది. దక్షిణ ఆసియాలో 5వ స్థానంలో ఉంది. 2008లో 138వ స్థానంలో ఉన్న మనం ప్రస్తుతం 143వ స్థానానికి దిగజారి పోయాం. ఇక మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. శాంతి సూచీలో చిట్టచివరి దేశంగా సిరియా మిగిలింది.

 

 కానీ, అత్యంత శాంతియుత దేశాలుగా ఉన్న నార్వే, స్వీడెన్‌లే ప్రపంచంలో ఎక్కువగా ఆయుధాలు ఎగుమతి చేసే దేశాలుగా ఉండటం బాధాకరం.  ఇక ప్రపంచ శాంతి సూచీ ప్రకారం అమెరికా 94వ స్థానంలో ఉంది.  ఓ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన హింస-అశాంతి అనేవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద సుమారు 14.3 ట్రిలియన్ల ఆర్థిక భారం మోపుతున్నాయి. అంటే ప్రపంచ జీడీపీలో సుమారు 13.4% అన్నమాట. ఈ ఖర్చు ఇంచుమించు బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, బ్రిటన్‌ల ఆర్థిక బడ్జెట్‌కు సమానం. 2010లో సుమారు 49వేల మంది అశాంతి, హింస కొట్లాటలలో మరణిం చగా, 2014 నాటికి లక్షా 80వేల మందికి చేరింది. శాంతియుత ప్రపంచం లేకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రస్తుతం అందరికీ బోధపడుతోంది కాబట్టి ప్రపంచశాంతికి ప్రతి దేశం కట్టుబడి ఉండాలి.    

 (నేడు ప్రపంచ శాంతి దినోత్సవం)    

 - డాక్టర్ పోటు భగత్‌కుమార్, రంగాపురం,

 నల్లగొండ జిల్లా

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top