ఏవీ ఆ అడుగుజాడలు? | Sakshi
Sakshi News home page

ఏవీ ఆ అడుగుజాడలు?

Published Tue, Sep 17 2013 12:23 AM

ఏవీ ఆ అడుగుజాడలు? - Sakshi

సంస్మరణం: తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధికారికంగా గుర్తించి నిర్వహించడం లేదు. దీనితో తమ ప్రత్యేకతను ఆరంభంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరించిందన్న భావనకు తెలంగాణ వారిలో బీజం పడింది.
 
 ఆగస్టు 15, 1947 దేశానికి స్వాతంత్య్రం లభిస్తే, తెలంగాణ సహా నిజాం సంస్థానంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సెప్టెం బర్ 17, 1948న స్వాతంత్య్రం లభించింది. హైదరాబాద్ సం స్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయడానికి సెప్టెం బర్ 13, 1948 నుంచి సెప్టెం బర్ 18, 1948 వరకు జరిగిన పోలీసు చర్య ఫలితంగా నిజాం ప్రభువు చేతులెత్తి తన సుముఖతను వ్యక్తం చేశాడు. స్వతంత్ర ప్రతిపత్తిని వదులుకుని, కొన్ని సదుపాయాలను రాబట్టుకుని సంస్థానాన్ని విలీనం చేశాడు.
 
 నిజాం సంస్థానంలో ఒకప్పుడు భాగంగా ఉండి, ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో భాగమైన ప్రాం తాలలో ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను సాధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. కానీ తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధికారికంగా గుర్తించి నిర్వహించడం లేదు. దీనితో తమ ప్రత్యేకతను ఆరంభంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరించిందన్న భావనకు తెలంగాణ వారిలో బీజం పడింది.  ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా తెలంగాణ వారికి ఇచ్చిన హామీలు, ఇరువురి మధ్య జరిగిన ఒప్పం దాలు, 610 జీవో వంటి కీలక అంశాలు నీటిమూటలుగా మిగిలిపోయాయనీ, ఆంధ్ర ప్రాంత పాలకుల నిర్లక్ష్యానికి తాము గురయ్యామనీ; రాజకీయంగా, సాంస్కృతికంగా వెనుకబడిపోవడానికి ఇవి కారణమైనాయనీ ఆ ప్రాంత ప్రజానీకం భావించడం మొదలుపెట్టింది. ఇదే నివురుగప్పిన నిప్పులా ఉండి, నిరసనల రూపంలో బయటపడుతూనే ఉంది. ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం కోసమే ఈ ఉపోద్ఘాతం చెప్పవలసివచ్చింది.
 
 నిజాం పాలనలో ఆయన తాబేదార్లు, భూస్వాములు, దుర్మార్గంగా సాగిన స్థానిక పాలన కారణంగా రైతులు, సామాన్య ప్రజలు, కష్టజీవులు, అణగారిన కులాల వారు తీవ్ర నిర్బంధానికీ, దోపిడీకి గురవుతూ ఉండేవారు. ప్రజాబాహుళ్యం మాట్లాడే తెలుగు భాష, అందులో వచ్చిన సాహిత్యం కూడా అణచివేతకు గురయ్యేవి. ఈ సాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఉద్యమించింది. ‘భూమి కోసం’, ‘భుక్తి కోసం’, ‘అణచివేత నుంచి విముక్తి కోసం’ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన రైతాంగం గొప్ప ప్రజా ఉద్యమం నిర్వహించింది. జూలై 4, 1946న దొడ్డి కొమరయ్య అమరత్వం ఆ పోరుకు నాందీ వాచకం కాగా, ముగింపు అక్టోబర్ 21, 1951న జరిగింది.
 
 నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల లో ప్రధానంగా పోరాటం జరిగినప్పటికీ మిగిలిన తెలంగాణ ప్రాంతాలలో కూడా ఎన్నో త్యాగాలు జరిగాయి. నాలుగు వేలకు పైగా యోధులు అసువులు బాశారు. నిర్బంధాలకూ, చిత్రహిం సలకు ఇక లెక్కలేదు. తెలంగాణ ఆడపడుచులు పురుషులతో పాటు పోరు బాట పట్టి వారితో సమంగా ఇక్కట్లు అనుభవించారు. నిజాం సైన్యాలే కాక, నెహ్రూసైన్యాలు, భూస్వాముల తొత్తులవల్ల కూడా స్త్రీలు అవమానాలకు, అరాచకాలకు గురయ్యారు. కానీ వారి పోరాటం ఫలితంగానే భూమి సమస్య ఎజెండాగా ముందుకు వచ్చింది. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పది లక్షల ఎకరాలను పేద రైతులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ‘దొరలు’ గడీలు కూడా విడిచిపెట్టి హైదరాబాద్ నగరానికి బతుకుజీవుడా అనుకుంటూ పోయారు. కాల్మొక్కుత భాం చన్ అన్న గొంతులే, గోల్కొండ ఖిల్లా కింద నీ గోరీ కడతామని హెచ్చరించేందుకు ఉద్యమం ధైర్యమిచ్చింది.  నవాబును, ఆయన తాబేదార్లను, గూండాలను ఆ పోరాటమే చావుదెబ్బ తీసింది. కేవలం సెప్టెంబర్ 13 నుంచి ఆరంభమైన పోలీసు చర్యతో నాలుగు రోజులలోనే నిజాం లొంగి పోయాడంటే, అప్పటికే ఆయన బలహీనపడ్డాడన్నమాట. 1952-1956 మధ్య జరిగిన అనేక పరిణామాల మధ్య తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిపి ఆంధ్రప్రదే శ్‌గా అవతరించాయి.

 

పాలకుల నిర్లక్ష్యం, తెలంగాణ పట్ల వివక్ష వల్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆరంభమైంది. అప్పటికే చీలిక వచ్చినప్పటికీ 1969లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో జరిగిన ఉద్యమ సమయంలో కమ్యూనిస్టులు రాష్ట్ర సమైక్యతకు కృషి చేశారు. ఆ సమయంలోనే భీమిరెడ్డి నరసింహారెడ్డి (నాటి శాసనసభ్యుడు) సభలోనే ‘‘చెన్నారెడ్డీ! నువ్వు పొట్టకూటి కోసం ఆంధ్ర నుంచి వచ్చిన కూలీలను, చిరుద్యోగులను హైదరాబాద్ నుంచి తరిమివేస్తానంటున్నావు. అలాగే చెయ్యి! ఈ సమయంలో మేం (కమ్యూనిస్టులం) గ్రామాలలో తిరిగి ప్రవేశించి భూస్వాములను, దొరలను తరిమికొడతాం!’’ అని గర్జించాడు. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత చరిత్రలో పేర్కొనదగినది తెలంగాణ సాయుధ పోరాటం.
 (నేడు తెలంగాణ విముక్తి దినోత్సవం సందర్భంగా...)

Advertisement
 
Advertisement