
ప్రేమ శిశువు....
ఏకైక శిశువు మనిద్దరికీ జన్మించిన మృదుల శిశువు మనిద్దరినీ జతపరిచిన శాశ్వత శిశువు
కవిత్వం
ప్రేమ
ఏకైక శిశువు
మనిద్దరికీ జన్మించిన మృదుల శిశువు
మనిద్దరినీ జతపరిచిన శాశ్వత శిశువు
పడుచుదనము
వార్థక్యము ఎరుగని పసికందు
మనవేపు నిరంతరం చూస్తోంది
మనమే లోకం వలె కళ్లప్పగించి తేరిపార
నవ్వు ముఖాలతో వుంటే
కిలకిలమంటోంది
ముద్దాడుకొంటుంటే
కేరింతలు కొడుతోంది
నువ్వు చిటికెలు వేస్తే
నేను చప్పట్లు చరిస్తే
కొత్తగా రెక్కలు విప్పారిన
సీతాకోకచిలుక మల్లే
తప్పటడుగులతో దగ్గర దగ్గరకొస్తోంది
ఆడుతోంది
నీ ఒడిలో అమాయక బాల్యం
పారాడుతోంది
నా గుండెల మీద మువ్వలతో అనంతకాలం
ఒకరు కనిపించీ
మరొకరం కనిపించని
ఏకాకి మేఘావృత గగనం కింద
బెంగటిల్లిపోతోంది ఆ తరుణం
ఆడిపాడి ఒకింత అలసిన గారాబు పట్టి
జోజోమన్న లాలిపాట ఒకటి
ఆలపించగా రాత్రిపూట చందమామ
నిశ్చింతలో నిద్రిస్తోంది నీకు నాకు మధ్య
లిల్లీపువ్వుల వంటి లేలేత వేళ్లతో
తట్టి తట్టీ లేపుతోంది
దినచర్యకి వేళవుతోందని
వేకువజామున నిన్నూ నన్ను
ప్రేమ
ఒక్కగానొక్క శిశువు
మనిద్దరికీ జన్మించిన కాలాతీత శిశువు
మనిద్దరినీ జతపరిచిన చిర నూతన శిశువు
- నామాడి శ్రీధర్, 9396807070