కూడికలతో మొదలయినా
లెక్క
కూడికలతో మొదలయినా
జమాఖర్చుల తీసివేతలు
నిర్దయ రాగానురాగాల భాగహారాలు
విజయాల హెచ్చవేతలు
పరాజయాల స్క్వేర్ రూట్లు
అనుభవాలు జ్ఞాపకాల శేషాలతో
అనంతంగా సాగిపోతున్న లెక్కకు
డెసిమల్ మిస్టేక్‌తో శూన్య శేషం.
బతుకు మొత్తం ఒక లెక్కే
లెక్కచేయలేకపోతే
ఎక్కేందుకు శిఖరాలు
కూర్చునేందుకు సింహాసనాలు
కనపడవేమో...
కొడవటి ప్రవీణ్‌కుమార్
9000929300
ఆకలి
పూటపూటకూ
పలకరించే అతిథి!
ఆకలి
చీకటికి అర్పించిన
పరువు!
కొత్తపల్లి సురేశ్ (అక్షరమాలి)
9493832470
ఎవరు... ఎవరి యొక్క...
కిసుక్కున నవ్వింది
చేతులు పిసుక్కునుడు జరుగుతుంది
పుసుక్కున స్పర్శ తగిలింది
నిష్కర్షగా పెయ్యి మొద్దుబారుతుంది
కీసు అన్నది
రసం తీసిన చెరుకులా
పీసు పీసు అవుతుంది
కాలనైతే కాలింది చెయ్యి
పట్టుకోను పచ్చనాకు లేదు
అయ్యొయ్యో! పసికుక్కకూన
కుయ్యోమొర్రో మొత్తుకునుడైతుంది
గడుసు పడుచులా
సూకగా కాలం నూక్కపోతుంది
చీకటిలో దేవులాడుడు
వెలుతురులో తరుముడు
కలుపు తలుపులు తీయాల్సినప్పుడు
తొంగి కిటికిలోంచి లొంగి చూసుడు
మంచె కంచె కలగల్సి
జంట పంటను మంట పెడుతుంది
చూపు రూపు దిద్దుకోకముందే
ఆకారాన్ని గద్ద ఎత్తుకపోతుంది
పంచుకోను రాదు
ఎంచుకునేది లేదు
జీవితమో వయస్సో కిసుక్కున నవ్వింది
చేతులు పిసుక్కు సచ్చుడవుతుంది
నాలికె సందున ముల్లు
తియ్యలేము మొయ్యలేము
పొందినది అందినది బుగులు
జిందగీ అంతా
పరుసుకునేంత కప్పుకునేంత దిగులు
ఆడికాడికి
మొగ్గులేని బతుకు
పూర్తి నిమానిమాల్ నివద్దే
పొయ్యేంత పొద్దువుంది
ఉండమని మోచెయ్యి పట్టు
జూకంటి జగన్నాథం