కవితలు | poetry in literature | Sakshi
Sakshi News home page

కవితలు

Jun 26 2016 11:40 PM | Updated on Aug 13 2018 7:54 PM

నిప్పుల పరుపు మీద విద్యుద్దిండు వేసుకుని

 సెగ పాగా
 నిప్పుల పరుపు మీద
 విద్యుద్దిండు వేసుకుని
 శరీరాగ్ని సేద
 ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు
 పగులుతున్న పర్వతాలు
 
 దూసుకుపోతున్న బస్సులో
 పేలుతున్న మందిపాతరలు
 
 ఎండిన బావి వద్ద
 భూమ్యాకాశాల సిగపట్లు
 
 గూడులేని వారి
 రక్తమాంసాల గుడ్డట్టును
 లొట్టలేసుకుని తింటున్న
 రోడ్డుపక్క
 అస్పృశ్యత పాటించని
 అనలానిలం
 
 పక్షులో మనుషులో
 ఏమైతేనేం, ఎవరైతేనేం
 ఊపిరాగిన తర్వాత
 
 మంటల కొమ్మలతో
 గాలిని కావలించుకుంటున్న
 ప్రకృతి
 సెగపాగా దులిపి
 ముఖం తుడుచుకుంటున్న
 బతుకు బాటసారి
 నిజం
 9848351806
 
 అమృతవర్షిణి
 దుఃఖం
 ఒక ఉపద్రవం
 ఆస్వాదించే క్షణం
 వీణతంత్రుల నిక్వాణం
 దుఃఖం
 లిప్తకాల కాలకూట గరళం
 ఆస్వాదించే క్షణం
 మృత్యుసౌందర్య వీక్షణం
 
- సూరేపల్లి మనోహర్
 
 జీవన దృశ్యరంగం
 
 కనుపాపలపై పరుచుకున్న నిద్రను
 నోట కరుచుకున్న కల
 వాస్తవిక జీవన దృశ్యాన్ని ఆవిష్కరించింది
 
 హృదయపు గదిలో నింపుకున్న ఊపిరిని
 సప్తస్వరాలుగా మలుచుకున్న లబ్‌డబ్
 సరికొత్త జీవన రాగాన్ని పలికించింది
 
 కలలు కనడం సహజం
 కన్న కలలోంచి కొత్త ఊపిరి
 అందుకోవడం అంతే సహజం
 
 ఊపిరందుకుని ఉరకలెత్తడం సహజం
 ఉరకలెత్తే ఊపిరితో సరికొత్త కలలు
 కనడం అంతే సహజం


 కోడం పవన్‌కుమార్,
 9848992825

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement