చాలా సందర్భాలలో టి.వి.లో చర్చా కార్యక్రమాలను చూస్తున్నప్పుడు, వార్తా పత్రికలలో వ్యాసాలను చదువుతున్నప్పుడు, ఈ సమాజ స్థితిగతులపై బ్రాహ్మణుల, బ్రాహ్మణత్వం ప్రభావాన్ని విశ్లేషించటం చూశాను.
చాలా సందర్భాలలో టి.వి.లో చర్చా కార్యక్రమాలను చూస్తున్నప్పుడు, వార్తా పత్రికలలో వ్యాసాలను చదువుతున్నప్పుడు, ఈ సమాజ స్థితిగతులపై బ్రాహ్మణుల, బ్రాహ్మణత్వం ప్రభావాన్ని విశ్లేషించటం చూశాను. కొంతమంది ఒక అడుగు ముందుకేసి బ్రాహ్మణత్వాన్ని నిర్మూలించే మరియు బ్రాహ్మణులను విమర్శించే వ్యాఖ్యలు చేయటం గమనించాను. వీరి యొక్క ఆలోచనల లోతును తెలుసుకోవటానికి చాలా పుస్తకాలను సంప్రదించాను. వీటి నుండి పుట్టుకొచ్చిందే ‘కశ్యప యోధుడు’ నవల.
తర్కము, చరిత్ర, భావజాలం మొదలైన విషయాలపై అనేక గ్రంథాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని చదివేవారు చాలా తక్కువమంది ఉంటున్నారు. నేను సేకరించిన విషయాలను ఒక కథ రూపంలో చెబితే ఎక్కువమందికి చేరుతుందనే ఉద్దేశంతో ఈ పుస్తక రచనకు పూనుకున్నాను.
ఈ నవలలోని కథాంశం సుమారు క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన కశ్యపాపురం, దానిని ఆనుకొని ఉన్న దట్టమైన అడవికి చెందినది. ప్రస్తుతం ‘ముల్తాన్’ అనే పేరుతో పాకిస్తాన్‌లో ఉన్న ఈ నగరం చరిత్రలో సింధు నాగరికతకు ముఖ్య కేంద్రంగా, అద్భుతమైన సామ్రాజ్యంగా విరాజిల్లింది. ఈ నవల మొత్తంలో మూడు రకాల సమాజాలను, వాటి స్థితిగతులను వివరించటమైనది. అవి ఆదిమ కమ్యూనిస్టు ఛాయలున్న నానాజీ తండా, వైదిక ధర్మాన్ని అనుసరిస్తున్న కశ్యపాపురం సామ్రాజ్యం, ఇస్లాం పుట్టి పరిఢవిల్లుతున్న అరేబియా సమాజం. అలాగే మూడు రకాల ధర్మాలు– వైదిక ధర్మం (ప్రస్తుత హిందూ ధర్మం), మహమ్మదీయ ధర్మం మరియు హేతువాదానికి దగ్గరగా ఉన్న ఎంతో పురాతనమైనదైన సూర్య ధర్మాలను విశ్లేషించటమైనది. ఆయా సమాజాలకు, ధర్మాలకు ప్రతినిధులుగా నరేంద్రుడు, ఖాసిం మరియు నానాజీ దర్శనమిస్తారు. అభ్యుదయ భావాలకు ప్రతినిధులుగా విజయనరసింహుడు, ఈశ్వరకృష్ణుడు; ఆవేశం మరియు మార్పుకు ప్రతినిధిగా రంగడు దర్శనమిస్తారు.
ఈ కథ 8వ శతాబ్దానికి చెందినదైనప్పటికీ అప్పటి సామాజిక అంశాలు, ఇప్పటి సమకాలీన అంశాలలో సారూప్యత కల్గి ఉండటం నన్ను రచనకు పురికొల్పిన మరొక అంశం.
కశ్యప యోధుడు (నవల); రచన: డాక్టర్ జూకూరి; పేజీలు: 272; వెల: 200; ప్రతులకు: విశాలాంధ్ర. ఫోన్: 0866–2430302