సోదరత్వ భావనే కీలకం

సోదరత్వ భావనే కీలకం


కొత్త కోణం

భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వంతో కూడిన సమాజం కావాలని అంబేడ్కర్ ప్రకటించారు. అందులో సోదరత్వం అత్యంత ఆవశ్యకమని కూడా ఉద్ఘాటించారు. ప్రజా స్వామ్యమంటే ప్రభుత్వాలు అనుసరించే విధానం మాత్రమే కాదనీ, ప్రజల జీవన విధా నంలో ప్రతిబింబించే సోదరత్వమే ప్రజాస్వామ్యమనీ అన్నారు. అందుకే భారతదేశ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రజాస్వామ్యాన్ని సోదరత్వ భావనగా చూడాలి. అటువంటి సమానత్వ విలువల కోసం సాగిన మహా సంగ్రామమే రెండున్నర వేల ఏళ్ల ప్రజాస్వామ్య ఉద్యమం.

 

 మనుషులందరికీ సమాన హక్కులూ, సమాన అవకాశాలూ, సమాన భాగస్వామ్యం, పాలనలో పారదర్శకత, గౌరవప్రదమైన జీవితం, వివక్షకు తావు లేని మానవ సంబంధాలు అన్నీ కలిస్తే ప్రజాస్వామ్యం. ఆ పేరు ఎత్తగానే మనకు గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటో ఆనాటి పాలనా వ్యవస్థలు గుర్తొస్తాయి. ప్రజాస్వామ్య పునాదులు అక్కడే ఉన్నట్టు చరిత్రకారులు ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లోకానీ, ఇతర పరిశోధక గ్రంథాల్లో కానీ భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణాన్ని ప్రస్తావించిన దాఖలాలు మాత్రం కనిపించవు. ఇప్పటి వరకు ఆధిపత్యం చెలాయిస్తున్న శక్తులన్నీ భారత ప్రజల ప్రజాస్వామిక పోరాటాల చరిత్రను రకరకాల పేర్లతో వక్రమార్గం పట్టించారు. భారతదేశ చరిత్రను ప్రజల దృక్కోణంలోనుంచి విశ్లేషించిన వాళ్లు సైతం, కొద్దిగా అటూ ఇటూగా హిందూత్వ ఆధిపత్య శక్తుల ఆలోచనల మూసలోనే ప్రయాణాన్ని కొనసాగించినట్టు చరిత్ర చెపుతోంది.



గ్రీకు రాజ్యంలో సమానత్వం అనే మాట వేళ్లూనుకొనకముందే, భారతదేశం అని ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఈ గడ్డమీద సమానత్వం, స్వేచ్ఛ, సోదరత్వ భావనలు పరిఢవిల్లాయి. వాటికోసం ఇక్కడ నిరంతరా యంగా సంఘర్షణ జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి వివిధ రూపాల్లో జరిగిన ఉద్యమాలన్నింటినీ ప్రజాస్వామిక ఉద్యమాలుగా కాక, మతపరమైన సంస్కరణ ఉద్యమాలుగా పక్కకుతోసి, యూరప్, అమెరికాల నుంచి ప్రజా స్వామ్య భావనలను మనం అరువు తెచ్చుకున్నాం. ఆధిపత్యం కొనసాగించే శక్తులు వీటిని రాక్షసకృత్యాలు, దైవవ్యతిరేక ఘటనలు, దుర్మార్గపు చర్యలుగా పేర్కొంటే, ప్రగతిశీల, అభ్యుదయ భావాలు కలిగిన మేధావులు వీటిని మత సంస్కరణోద్యమాలకు కుదించారు. ఈ రెండు ధోరణులు భారత ప్రజా స్వామిక చరిత్రలోని సత్యాలను మరుగుపరిచాయి. ఇప్పుడైనా భారత ప్రజాస్వామిక చరిత్రలోని చారిత్రక వాస్తవాలపై చర్చ జరగాలి. అంత ర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మన ప్రజాస్వామ్య మహ త్తర చరిత్రను మననం చేసుకుందాం.



ప్రజాస్వామ్య పరిధి విస్తృతమైనది

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించాలని 2007లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఇది 2008 సంవత్సరం నుంచి అమలవుతోంది. ఈ అంశం మీద 1997, సెప్టెంబర్ 16న ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన సమావేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో మొదటి భాగంలో మొట్టమొదటి పేరాలో ‘సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక తేడాలు లేకుండా ప్రపంచంలోని ప్రజలందరూ ఒకే విధమైన విలువలపైన ఆధారపడి జీవితాలను గడిపే హక్కు ప్రజాస్వామిక విలువలలో అత్యంత ముఖ్యమైన అంశం’ అంటూ దిశానిర్దేశం చేశారు.



ప్రజాస్వామ్యం వివిధ దేశాల్లో రకరకాల రూపాల్లో అమలు జరుగు తున్నది. కొన్ని దేశాలు చిత్తశుద్ధితో ప్రజాస్వామ్య విలువలను పాటిస్తుంటే, మరికొన్ని ఆ పేరును వల్లెవేస్తున్నాయి.  భారత ప్రజాస్వామ్యం కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నది. మన ప్రజాస్వామ్యం యూరప్, అమెరికా నమూనాల నుంచి కొన్ని అంశాలను తీసుకొని చట్టాలలో పొందుపరుచుకొని ఉండవచ్చు. కానీ గత రెండున్నర వేల సంవత్సరాల ప్రజల బలమైన సమా నత్వ కోరికలు, సంఘర్షణలు, త్యాగాలు ఈ ప్రజాస్వామ్యం భావజాలం వెనుక ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనగానే ‘ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల ప్రభుత్వం’ అన్న అబ్రహం లింకన్ మాటలను ఉటంకిస్తుంటాం. కానీ ఇది పాక్షిక సత్యం. ప్రజాస్వామ్య భావనను భారతదేశానికి అన్వయించే విధంగా వ్యాఖ్యానించిన వారు బాబాసాహెబ్ అంబేడ్కర్.



భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వంతో కూడిన సమాజం కావాలని ఆయన ప్రకటించారు. అందులో సోదరత్వం అత్యంత ఆవశ్యకమని కూడా ఉద్ఘాటిం చారు. సోదరత్వానికి మరో రూపమే ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. ప్రజా స్వామ్యమంటే ప్రభుత్వాలు అనుసరించే విధానం మాత్రమే కాదని, ప్రజల జీవన విధానంలో ప్రతిబింబించే సోదరత్వమే ప్రజాస్వామ్యమని స్పష్టం చేశారు. అందుకే భారతదేశ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రజాస్వామ్యాన్ని సోదరత్వ భావనగా చూడాలి. అటువంటి సమానత్వ విలువల కోసం, జీవితాల కోసం సాగిన మహా సంగ్రామమే రెండున్నర వేల సంవత్సరాల ప్రజాస్వామ్య ఉద్యమం.



బౌద్ధం కృషి మరువలేనిది

భారతదేశంలో వేదాల ప్రామాణికతని ఉన్నతంగా చూపెట్టి, తమ ఆధి పత్యాన్ని నిలుపుకోవడానికి వర్ణ వ్యవస్థను, అనంతరం కుల వ్యవస్థను సృష్టించి, పెంచి పోషించిన పూజారి వర్గానికి వ్యతిరేకంగా ఆది నుంచే ప్రతిఘటన మొదలైంది. మొదట్లో చార్వాక, లోకాయుక్త, అజీవక, జైనులు బ్రాహ్మణ పురోహిత ఆధిపత్యాన్ని నిరసించారు. మనుషులంతా ఒక్కటేననే విషయాన్ని ఆ సిద్ధాంతాలు ముందుకు తీసుకొచ్చాయి. వీటన్నింటి ఆచరణ ఆధారంగా ఆ భావాలను మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లగలిగిన చైతన్యమే బౌద్ధం ఆవిష్కరణకు మూలం. గౌతమ బుద్ధుడు ప్రతిపాదించిన త్రిశరణాలలో ధమ్మం, సంఘం అనేవి ప్రజాస్వామ్య విలువలకు ప్రాథమిక రూపాలు. బుద్ధుడు ప్రతిపాదించిన సంఘంలో వివక్షకు చోటులేదు. కులం, లింగం, ప్రాంతం ఎటువంటి భేదాలు పాటించని వ్యవస్థ బౌద్ధ సంఘం. ఆనాటి అసమాన సామాజిక వ్యవస్థకు ఎదురైన మొదటి ప్రతిఘటన బహుశా అదే.



ఈ విధానాలే తదనంతరం ముఖ్యంగా అశోకుడు, కనిష్కుడు హర్షవర్ధనుడి లాంటి చక్రవర్తులు బుద్ధుని ప్రజాస్వామ్య భావాలను తమ పాలనలో భాగం చేసుకున్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించడా నికి అశోకుడు చేసిన ప్రయత్నం  మరువలేనిది. ప్రజలకు నాటి అభివృద్ధి ఫలాలు అందడానికి ఆయన రూపొందించిన విధానాలు ఎంతో ప్రాము ఖ్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రజలు తమ జీవితాలను సుఖ సంతోషాలతో ఉంచడానికి అశోకుడు చేసిన ప్రయత్నం ప్రజాస్వామ్య భావనలో భాగంగానే చూడాలి. అయితే ఈనాటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థను ఆనాటి పాలనతో పోల్చిచూడడానికి ప్రయత్నం చేసేవాళ్లు కొందరు న్నారు. అది పొరపాటు. ఆనాడున్న సామాజిక పరిస్థితుల్లో ఆ విధానాలు ఏమేరకు సమాజంలో సమానత్వ భావనకు కృషిచేశాయి, ప్రజలను సమా నత్వం వైపు ముందుకు నడిపించాయి అనేది ముఖ్యం. ఆనాడున్న ఆధిపత్య భావజాలాన్ని, ప్రజాస్వామిక విధానాలు ప్రతిఘటించిన తీరును మనం గమనంలోకి తీసుకోవాలి. దీనినే చరిత్రను భౌతికవాద దృష్టితో చూడడంగా చెప్పుకోవాలి.



ఐక్యపోరాటాలతోనే ప్రజాస్వామ్యం

ఆనాడు బుద్ధుడు, అశోకుడు సాగించిన ప్రజాస్వామిక విప్లవాన్ని మళ్లీ బ్రాహ్మణ పురోహిత వర్గాలు  క్షత్రియులతో కలసి దెబ్బతీశాయి. దానినే అంబేడ్కర్ ప్రతీఘాత విప్లవంగా పేర్కొన్నాడు. చరిత్రను ఎవ్వరూ మరుగు పర్చలేరు. వివిధ రూపాల్లో చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. పాత భావాల నుంచి విముక్తమయ్యేందుకు విప్లవోన్ముఖం అవుతూనే ఉంటుంది. ఏదో రూపంలో అసమానతలను ప్రతిఘటిస్తూనే ఉంటుంది. అశోకుడి పాలన తర్వాత క్రమక్రమంగా బలాన్ని పుంజుకున్న బ్రాహ్మణ పూజారి వర్గం కులవ్యవస్థను వ్యవస్థీకృతం చేసే పనిని సాగించింది. ఆ విధంగా కుల వ్యవస్థకు ఒక రూపాన్నీ, శక్తినీ అందించింది. ఆ క్రమంలోనే భగవంతుని చట్రంలోనే, మత పరిధిలోనే మధ్య యుగాల్లో భక్తి ఉద్యమాలు బయలు దేరాయి. అందులో బసవేశ్వరుడు సాగించిన వీర శైవం, రామానుజుడు సాగించిన వీర వైష్ణవం కుల వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించాయి.



ఈ రెండు ఉద్యమాలు కులాలన్నింటికీ తమలో భాగస్వామ్యం కల్పించాయి. తద్వారా అన్నికులాలు సమానమనే భావానికి దైవత్వాన్ని జోడించి ప్రజలముం దుంచాయి. ఆ తర్వాత కబీర్ తీసుకొచ్చిన వాదన, సాగించిన ఉద్యమం, ఉత్తరాదిని ప్రభావితం చేసింది. అందువల్లనే వృత్తికులాలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బ్రాహ్మణ వ్యతిరేక భావంతో ఈ ఉద్యమాలలో భాగస్వా ములయ్యాయి. వీర శైవంలో అంటరానికులం నుంచి మాదిగలు, వీరవైష్ణ వంలో మాలలు ప్రధాన భాగస్వాములు కావడం గమనించాలి.



ఆ తర్వాత రవిదాసు, నానక్, మీరాబాయి, తమిళనాడులో సిద్ధ ఉద్యమం, తెలుగునేలపైన బ్రహ్మంగారు, వేమన సాగించిన ఉద్యమాలు కూడా ఇందులో భాగంగానే చూడాలి. మహారాష్ట్రలో సాగిన వరకర ఉద్యమం, ఆ తర్వాత మహాత్మా జ్యోతీరావ్‌ఫూలే ప్రతిఘటన ఉద్యమం ప్రారంభమయ్యే నాటికి ఆధునిక ధోరణులు మొదలయ్యాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో సాగుతున్న బానిస వ్యతిరేక పోరాటాలు ఫూలేను ఆధునిక ప్రజాస్వామ్య భావాల వైపు నడిపించాయి. అయితే వాటిని మరింతగా శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి అసమాన సమాజానికి ప్రతినిధిగా మనువాద సిద్ధాంతానికి నిర్దిష్టమైన ముగింపు పలికే అస్త్రశస్త్రాలను సమకూర్చింది బాబాసాహెబ్ అంబేడ్కర్. స్వాతంత్య్రం కోసం జరిగిన రాజకీయ పోరాటాల్లో రూపొందించుకున్న విధానాలు కూడా కుల వ్యవస్థను ప్రశ్నించాయి.



వీటన్నింటితో పాటు బాబాసాహెబ్ తన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నిరంతరంగా అధ్యయనం - పోరాటం అనే విధానంతో సాగించిన సంఘర్షణ భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య విలువలకు స్థానం కల్పించింది. బుద్ధుడు ప్రారంభించిన ప్రజాస్వామ్య పోరాటం, బాబాసాహెబ్ అంబేడ్కర్ వరకు కొనసాగి భారతీయ ప్రజలకు రాజ్యాంగం అనే ప్రజాస్వామ్య ఆయుధాన్ని అందించింది. అయితే ఇంకా ఆ పోరాటం పరిపూర్తికాలేదు. అంబేడ్కర్ చెప్పినట్టు ప్రజాస్వామ్యం విలువ దాని అమలుపైనే ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం రాజ్యాంగం ప్రతిపై కాదు. అందుకే నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను సాధించుకోవడానికి విశాల ప్రాతిపదికపై మరింత శక్తిమంతమైన ఐక్య పోరాటాలు అవసరం.




 మల్లెపల్లి లక్ష్మయ్య

 (నేడు ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం)

 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్ : 97055 66213

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top