అన్నమూ అక్షరమూ లేని చదువులు | ap, tg govts should focus on sanitery problems in government schools | Sakshi
Sakshi News home page

అన్నమూ అక్షరమూ లేని చదువులు

Dec 16 2015 12:46 AM | Updated on Sep 3 2017 2:03 PM

అన్నమూ అక్షరమూ లేని చదువులు

అన్నమూ అక్షరమూ లేని చదువులు

డబ్బుతో చదువుని కొనుక్కోలేక, పొద్దుపొడవకముందే తల్లితోపాటు కూలికి వెళ్ళి నానా చాకిరీ చేసి ఖాళీ కడుపుతో పాఠశాలలకు వెళ్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులకు వస్తున్న జబ్బులేవో మనకీ మన సర్కారుకీ తెలుసా?

విశ్లేషణ

డబ్బుతో చదువుని కొనుక్కోలేక, పొద్దుపొడవకముందే తల్లితోపాటు కూలికి వెళ్ళి నానా చాకిరీ చేసి ఖాళీ కడుపుతో పాఠశాలలకు వెళ్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులకు వస్తున్న జబ్బులేవో మనకీ మన సర్కారుకీ తెలుసా?

 

 గుండె కలుక్కుమంటుంది. ఏ బడిలోనో ఏదో ఘోరం జరిగినప్పుడు. ఏ మారు మూల ఊరు బడిలోనో కాదు మహానగరం మధ్యలోనే మాస్టారింట్లో వెట్టి చాకిరీ చేయనందుకు ఓ మైనారిటీ చిన్నారిని బడినుంచి గెంటివేసినందుకు. అందుకే కాదు. ఒళ్ళంతా పుళ్ళయి రక్తసిక్తమైన ఒంటికింత మందు లేనప్పుడు తోటి విద్యార్థులు గేలి చేస్తుంటే మనసు చిన్నబుచ్చుకున్న నా విద్యార్థి కళ్ళల్లో దీనత్వం చూసినప్పుడు హృదయం విలవిల్లాడుతుంది. చిట్టచివరి బెంచీలో కూర్చొని రోజూ నిద్రపోతున్న విద్యార్థికి క్రమేణా చూపు తగ్గిపోతోందని అందుకు అతని పేదరికం, పౌష్టికాహారలోపమే కారణమని తెలి సినప్పుడు మనసు మెలితిప్పే బాధ. నాలుగు అక్షరం ముక్కలతో పాటు నాలుగన్నం మెతుకులు వారికి సక్ర మంగా అందడం లేదనే చింత నిత్య ఉపాధ్యాయుడిగా ఉన్న నన్నింకా వేధిస్తూనే వుంది.

 స్వచ్ఛ భారత్‌పై యావత్ దేశం చర్చించుకుంటున్న ప్పుడు మరుగుదొడ్లు లేక ఒకే చోట పదే పదే మూత్ర విసర్జన చేసి ఆడపిల్లలు జబ్బుపాలై నందుకు, ఇన్‌ఫెక్ష న్లతో గైనిక్ వ్యాధులతో విలవిల్లాడు తున్నందుకు; నగ రంలోని ఓ పాఠశాలలో ఒకే తరగతి గదిలో తగిలించిన అమ్మాయిల సెలవు చీటీలన్నింటిలోనూ ‘‘కడుపునొప్పి తో బడికి రాలేకపోతున్నాను’’ అన్న వాక్యాలే చదివిన ప్పుడు గుండె గొంతులో చిక్కుకున్నట్టవుతుంది. ఎక్కడో గిరిజన గూడేల్లో ఆడపిల్లలపై జరిగిన అత్యాచారం ఫలి తంగా చిట్టితల్లులే కన్నతల్లులుగా మారిన దుర్మార్గాల్ని చూసినప్పడు ఒళ్ళు జలదరిస్తుంది.

 

 డబ్బుతో చదువుని కొనుక్కోలేక, పొద్దుపొడవక ముందే తల్లితోపాటు కూలికి వెళ్ళి నానా చాకిరీ చేసి ఖాళీ కడుపుతో పాఠశాలలకు వెళ్తున్న ప్రభుత్వ పాఠశా లల విద్యార్థినీవిద్యార్థులకు వస్తున్న జబ్బులేవో మనకీ మన సర్కారుకీ తెలుసా?  పిల్లల రోజువారీ శారీరక, ఆరోగ్యపరమైన, మానసిక మార్పులు గమనించే వ్యవస్థ మనకి ఎందుకు లేకుండా పోయింది? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. (యుక్తవయస్సులో ఉన్న చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదల బాధ్యతెవ్వరిదో ఎవరికి తెలియాలి? కేవలం ఉపాధ్యాయుడిదేనా? లేక కేవలం ప్రధానోపాధ్యాయుడిదేనా? లేదంటే అక్షరజ్ఞానం కూడా లేని కూలినాలి చేసుకునే పేద తల్లిదండ్రులదా?) ఇప్పుడు సమాధానం వెతకాల్సింది సరిగ్గా ఈ ప్రశ్నకే.

 

 పైవన్నీ ప్రశ్నలే సమాధానం లేని ప్రశ్నలు. ఒక ప్పుడు పివి నరసింహారావు ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలల్లో నర్సింగ్ వ్యవస్థ ఉండేది. విద్యార్థులను అంటి పెట్టుకొని ఒక నర్సు ఉండేది. వారికి వచ్చే జబ్బులు, వారికి ఎదురయ్యే శారీరక అనారోగ్య సమస్యలు గమనించి, వారికి తగిన సూచనలు చేసేది. అవసరమైతే వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళి వారికి చికిత్స చేయించే వ్యవస్థ ఉండేది. ఆ తరువాత కూడా చాలా కాలం వరకు పాఠశాలల్లో ప్రతి మూడు నెలలకో, లేక ఆరునెలలకో ఓ సారి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరికీ ప్రభుత్వమే మెడికల్ క్యాంపులు నిర్వహించేది. వారి ఆరోగ్య పరిస్థితులను రికార్డు చేసేది. అవసరమైన మేరకు పాఠశాల ఉపాధ్యాయులకు, అలాగే తల్లిదండ్రు లకు వారి సమస్యలను వివరించేది. పౌష్టికాహార లోపంతో బలహీనంగా ఉన్న పిల్లలకు సప్లిమెంట్స్ సైతం కొన్ని చోట్ల ప్రభుత్వమే ఉచితంగా అందజేసేది. కానీ ఇప్పుడా వ్యవస్థ లేనేలేదు. ఆ విధానం కనుమ రుగైపోయింది. ఈ కారణంగానే చిన్నవయస్సులోనే జబ్బుని గుర్తించి నయం చేసే పరిస్థితి లేకుండా పోయింది.

 

 విద్యాహక్కు చట్టం కారణంగా ఇప్పటికే బడిగడప తొక్కనటువంటి వర్గాల పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు, దళిత, ఆదివాసీల పిల్లలు, వికలాంగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కానీ ఈ వర్గాలకు చెందిన ఎందరో పిల్లల పేర్లు పాఠశాలల్లో నమోదైనప్పటికీ, వారి శారీరక అసౌకర్యం వల్ల, అత్యధిక కాలం పాఠశాలలకు దూరంగానే ఉంటున్నారు. కాబట్టి వారిని పాఠశాలల్లో చేర్చడం ఎంత ప్రధానమో, వారికి క్రమం తప్ప కుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం అంతకన్నా ప్రధానం అన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాల్సి వుంది.

 

 పిల్లల విద్య, వైద్యం, పౌష్టికాహారం ఈ మూడిం టినీ ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నప్పుడు విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు జరుగుతుంది. ఎందరో వైద్యులు ఉచిత సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. అటువంటి వారి సాయం తీసుకుని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యం కార ణంగా బడికి వెళ్ళలేని పరిస్థితులు లేకుండా మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. కాబట్టి సమస్య తలెత్తిన ప్పుడు గగ్గోలు పెట్టడం కంటే, ఎవరినో ఒకరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కంటే శాశ్వత పరిష్కారానికి యత్నించడం సబబుగా ఉంటుంది.

 అలాగే కిశోర బాలికలకు పౌష్టికాహారంతో పాటు నెలనెలా అవసరమయ్యే శానిటరీ నాప్‌కిన్స్‌ని ప్రభు త్వమే ప్రతి పాఠశాలకు సరఫరా చేయాలి. అతి తక్కువ ధరకు సైతం వాటిని తయారుచేసే అవకాశం వున్నచోట నుంచి ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసి ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు అంద జేయడం అత్యవసరం. వీటన్నింటికీ తోడు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవ సరం ఎంతైనా వుంది. మరుగుదొడ్లపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ ఏ రాష్ట్రప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. కనీసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనైనా మరుగుదొడ్ల సమస్య తీవ్రతను పాలకులు గుర్తిస్తే మంచిది.

http://img.sakshi.net/images/cms/2015-03/41426188468_295x200.jpg

 వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, డాక్టర్ చుక్కా రామయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement