అమెరికా: లాక్‌డౌన్‌ బాధితులకు అండగా యూఎస్‌ఐఎస్‌ఎమ్‌

USISM Helping To Indians To Return India On Lockdown Padamic - Sakshi

న్యూయార్క్‌ : కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా అమెరికాలో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారికి ‘యూఎస్ ఇండియా సాలిడారిటీ మిషన్ (యూఎస్‌ఐఎస్‌ఎమ్‌)’  బాసటగా నిలిచింది. ఈ నెల 26వ తేదీన ఖతర్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో దాదాపు 250 మందిని స్వదేశానికి తీసుకువచ్చింది. వందలాది భారతీయుల్ని సొంతగడ్డపైకి తీసుకువచ్చేందుకు యూఎస్‌ఐఎస్‌ఎమ్‌ అధ్యక్షుడు రవి పులి కృషిని పలువురు కొనియాడారు. భారత్‌ చేరుకున్న వారు యూఎస్‌ఐఎస్‌ఎమ్‌ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

యూఎస్‌ఐఎస్‌ఎమ్ ఎంతో సహాయం చేసింది : నిహారిక, విద్యార్థిని
నేను అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. న్యూయార్క్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఇండియా రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఎయిర్‌ ఇండియా విమానాలు అందుబాటులో లేవు. యూఎస్ ఇండియా సాలిడారిటీ మిషన్ వాళ్లు విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. వాళ్లు నాకెంతో సాయం చేశారు. ఎప్పటికప్పుడు వివరాలు అందించారు. ఎవర్ని సంప్రదించాలో చెప్పారు. విమానంలో చక్కని సదుపాయాలు ఉన్నాయి. భౌతిక దూరం పాటించే ఏర్పాట్లు చేశారు. ప్యాసింజర్ సీటు పక్కన ఒక సీటును ఖాళీ వదిలేశారు. అందరికీ కృతజ్ఞతలు. 

ఎయిర్‌పోర్టుకు స్వయంగా రవి పులి వచ్చారు :  రాజు, అడ్వకేట్‌
నా పేరు రాజు, మా ఆవిడ సురేఖ. మేమిద్దరం హైకోర్టులో అడ్వకేట్‌గా చేస్తున్నాం. గత సంవత్సరం అమెరికా వచ్చాం. లాక్‌డౌన్ కారణంగా మారన్చిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేశారు. అప్పటి నుండి ఇండియా వెళ్లడానికి శత విధాల ప్రయత్నించాం. కానీ లాభం లేకుండా పోయింది. చివరగా రవి పులి స్థాపించిన యూఎస్‌ఐఎస్‌ఎమ్‌ అనే సంస్థ స్పెషల్ ఫ్లైట్ నడుపుతుందని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. అమెరికాలో ప్రయాణికులకు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి రవి పులి స్వయంగా విమాశ్రయానికి స్వయంగా వారి నిబద్ధతను చాటి చెప్పింది. ఈ ఏర్పాట్లు చేసిన యూఎస్‌ఐఎస్‌ఎమ్‌ బృందానికి, రవి పులికి మా కృతజ్ఞతలు.

ప్రయాణం చాలా హాయిగా సాగింది: జెర్రీ, కేరళ
మాది కేరళలోని కొట్టాయం. అమెరికా నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం. విమాన ప్రయాణాలపై నిషేధంతో అమెరికాలోనే చిక్కుకుపోయాం. యూఎస్ఐఎస్ఎమ్‌ వాళ్ల సాయంతో నా కుటుంబ సభ్యులతో కలసి ఖతర్ ఎయిర్‌వేస్ విమానంలో హైదరాబాద్ చేరుకున్నాం. విమాన ప్రయాణం చాలా హాయిగా సాగింది. దీనికి వీలు కల్పించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ సందర్భంగా యూఎస్‌ఐఎస్‌ఎమ్‌ అధ్యక్షుడు రవి పులి మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్‌, ఖతార్‌లోని ఇండియన్‌ ఎంబసీ,  విదేశీ వ్యవహారాల శాఖ, విమానయాన శాఖ, భారత్‌, తెలంగాణ ప్రభుత్వాల నుంచి సహాయ, సహకారాలు లేకపోతే తానీ పనిని ఇంత విజయవంతంగా చేయగలిగేవాడిని కానని తెలిపారు. తనను గైడ్‌ చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా అమెరికాలోని తెలుగు, భారత సంస్థలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘మీలో కోరిక ఉంటే మీరు చరిత్ర సృష్టించగలరు, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం కనుక్కోగలర’ని రవి పులి అన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top