
గల్ఫ్ డెస్క్: సౌదీ అరేబియాలోని జెద్దాలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో, యూఏఈలోని దుబాయిలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఈనెల 26న గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. జెద్దాలోని కాన్సులేట్ కార్యాలయంలో ఉదయం 7.45గంటలకు జాతీయ పతాకావిష్కరణ జరగనుంది. కాన్సులేట్ జనరల్ ఎండీ నూర్ రెహమాన్ షేక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
జెద్దాలో ఉన్న ప్రవాస భారతీయులతో పాటు వివిధ దేశాలకు చెందిన వారు కూడా హాజరు కావచ్చని విదేశాంగ శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, గణతంత్ర వేడుకలకు హాజరయ్యేవారు హ్యాండ్ బ్యాగులు, మొబైల్ ఫోన్‌లను తీసుకురావద్దని అధికారులు సూచించారు. దుబాయిలోని అల్ హమారియా డిప్లొమెటిక్ ఎన్‌క్లేవ్ ఆవరణలో నిర్వహించే జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి అందరు భారతీయులు హాజరు కావాలని విదేశాంగ శాఖ అధికారులు కోరారు.