‘హోదా మన హక్కు, ప్యాకేజీతో మోసపోవద్దు’ | Sakshi
Sakshi News home page

‘హోదా మన హక్కు, ప్యాకేజీతో మోసపోవద్దు’

Published Thu, Feb 15 2018 2:55 PM

NRIs support to YS Jagan Mohan Reddy protest for special status - Sakshi

వాషింగ్టన్ నుంచి సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయడానికి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలతో భేటీ అయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయానికి అమెరికాలోని ప్రవాసాంధ్రులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌కు ఏపీ ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన, ప్రజలు మద్దతు తెలుపుతున్న తీరు చూసి రాజన్న రాజ్యం త్వరలోనే వస్తుందని వాషింగ్టన్ డి.సి మెట్రోలో ఉన్న ఎన్అర్ఐలు ముక్త కంఠంతో పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయంలో విలువలు, విశ్వసనీయత ఉందని కొనియాడారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్ జగన్ చేసిన ప్రకటన చారిత్రాత్మకమన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరని, హోదా సాధించే వరకూ వైఎస్సార్‌సీపీ విశ్రమించబోదని వల్లూరు రమేష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ సలహాదారు, రీజనల్ ఇంఛార్జి (మిడ్ అట్లాంటిక్) స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇడుపులపాయలో దివంగత సీఎం, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి సాక్షిగా ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర నేడు 88వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగడాన్ని అమెరికాలోని తెలుగు ప్రజలు (ఎన్‌ఆర్ఐలు) హర్షించారు. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిచి, వైఎస్ జగన్ సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తారని ఆకాంక్షించారు. ప్రజల అండతో 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ప్రవాసాంధ్రులు ధీమా వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా మా హక్కు, ప్యాకేజీ వద్దు అన్న నినాదంతో పోరాటానికి వైఎస్సార్‌సీపీ మరోసారి పిలుపునిచ్చింది. మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 5 వరకు వివిధ దశల్లో పోరాటానికి కార్యాచరణ ప్రకటించారు. మార్చి 1న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు, 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. నిరసన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మన గొంతుకను వినిపిద్దామని పిలుపునిచ్చారు. ప్రధాన అస్త్రంగా తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైఎస్ జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement